టచ్‌లో ఉన్నారా? | - | Sakshi
Sakshi News home page

టచ్‌లో ఉన్నారా?

Jan 24 2024 6:50 AM | Updated on Jan 24 2024 3:55 PM

- - Sakshi

ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ కావడంపై సర్వత్రా హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. వీరంతా ‘హస్తం’వైపు చూస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవలే దావోస్‌ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న సీఎంతో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ కావడం.. అదికూడా రేవంత్‌ ఇంట్లో కలవడంపై తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యేలు మాత్రం అభివృద్ధి పనుల కోసం కలిశామంటున్నా తెరపైకి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు దోహదం చేస్తున్నాయి.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సీఎం రేవంత్‌ రెడ్డిని నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్‌, దుబ్బాక, పటాన్‌చెరు, జహీరాబాద్‌ ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, గూడెం మహిపాల్‌ రెడ్డి, మాణిక్‌ రావు మంగళవారం సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. వీరు సీఎంను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వీరు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌ నుంచే బీఆర్‌ఎస్‌లో చేరారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి మొదటి నుంచి గులాబీ బాస్‌ కేసీఆర్‌కు సన్నిహితుడు.

మిగతా ఇద్దరు నేతలు కూడా కేసీఆర్‌ వెన్నంటి నడుస్తున్న వారే. రేవంత్‌రెడ్డితో పాటు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బి.శివధర్‌రెడ్డిని కూడా వీరు కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ నలుగురు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చకు దారితీస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర మంత్రులు అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్‌ఎస్‌ విమర్శలపై స్పందించిన కోమటిరెడ్డి.. తమతో సుమారు 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వీరు భేటీ కావడం హాట్‌టాపిక్‌గా మారింది.

మోదీని రేవంత్‌రెడ్డి కలిసినట్లుగానే..: ఎమ్మెల్యేలు
‘సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశా.. ఇందులో ప్రత్యేకమేమీ లేదు.. పటాన్‌చెరు నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కోరాం. ఇందుకు ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ప్రధానిని రేవంత్‌రెడ్డి కలిసినట్లుగానే తాము కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం కలిశాం..’’ అని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. జహీరాబాద్‌లోనూ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరాం.. తమ నియోజకవర్గంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదనే అంశంపైనా సీఎంతో చర్చించాం.. తాము నియోజకవర్గంలో పర్యటిస్తుంటే పైలెట్‌ వెహికిల్‌ కూడా ఇవ్వడం లేదు.. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. అని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు ‘సాక్షి’తో అన్నారు.

ప్రొటోకాల్‌ వివాదం..
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తుతోంది. ప్రధానంగా నర్సాపూర్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలి పారు. ఈ విషయంలో నర్సాపూర్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఈ ప్రొటోకాల్‌ విషయంలో గొడవలకు దారితీసింది. ఈ ప్రొటోకాల్‌ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డిని కూడా కలిశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement