బెల్లంపల్లి: బీఆర్ అంబేడ్కర్ అడుగు జాడల్లో విద్యార్థులు నడవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ అన్నారు. శనివారం బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ) పాఠశాల, కళాశాలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ కళాశాల ఉత్తమ విద్యకు మారుపేరుగా నిలుస్తోందని అన్నారు. విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు సాధిస్తూ ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. దేశంలోని అత్యున్నత విద్యాలయాల్లో చదువుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్, వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ నిర్వాహకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


