మంచిర్యాలటౌన్: మంచిర్యాల టూటౌన్‌లోని రాజీవ్‌నగర్ వాసులకు ప్రతియేటా వర్షాకాలంలో తిప్పలు తప్పడం లేదు. నగరానికి దూరంగా ఉండడం వల్ల హైటెక్‌సిటీ కాలనీ వద్ద ఉన్న రైల్వే అండర్‌బ్రిడ్జి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. కిలోమీటరు దూరం ప్రయాణిస్తే నేరుగా మంచిర్యాలకు చేరుకోవచ్చు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు బ్రిడ్జి కింద వరద నీరు చేరి రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. ద్విచక్రవాహనాలు వరద నీటిలో సగం వరకు మునుగుతున్నాయి. దీంతో ప్రత్యామ్నయంగా గోపాల్‌వాడ, హమాలీవాడ మీదుగా ఐదు కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మంచిర్యాలకు చేరుకుంటున్నారు. ఆటోలో రావాలంటే ఒక్కొక్కరికి రూ.60కి పైగా ఖర్చవుతోంది. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నాలుగు వేలకు మందికి పైగా నిరుపేదలు నివాసం ఉంటున్నారు. కూలీ, ఇళ్లల్లో పనులు చేసే వారు కావడంతో ప్రయాణం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడం, చుట్టూ తిరిగి రావడం వల్ల రవాణా భారంతోపాటు సమయం వృథా అవుతోంది. లక్ష్మీ టాకీస్ నుంచి గోపాల్‌వాడ, హమాలీవాడ మీదుగా రైల్వే అండర్‌బ్రిడ్జి మంజూరైనా స్థల వివాదం కోర్టులో ఉండడంతో బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోవడం లేదు. రైల్వే అండర్‌బ్రిడ్జి, వందఫీట్ల రోడ్డు పూర్తయితే రాజీవ్‌నగర్‌తోపాటు గోపాల్‌పాడ, హమాలీవాడ ప్రజలకు మంచిర్యాలకు రాకపోకల ఇబ్బందులు తప్పుతాయి.
రాళ్లవాగు కాజ్‌వే కష్టాలు
మంచిర్యాలలోని అమరవీరుల స్తూపం నుంచి ఆండాళమ్మ కాలనీ వెళ్లేందుకు రాళ్లవాగుపై నిర్మించిన కాజ్‌వే ప్రతియేటా వర్షాకాలం వరద నీటిలో కొట్టుకుపోయి రాకపోకలు నిలుస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతులతో పునరుద్ధరిస్తున్నారు. ఈ కాజ్‌వేను ఆండాళమ్మ కాలనీ, రంగంపేట్, పవర్‌సిటీ, సన్‌సిటీ, పాతమంచిర్యాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్నారు. వర్షాకాలంలో కాజ్‌వే కొంత భాగం కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు పాతమంచిర్యాలలోని ప్రధాన రహదారి బ్రిడ్జి నుంచి తిరిగి మంచిర్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం పెరుగుతోంది. ఇటీవల కాజ్‌వే స్థానంలో నూతన బ్రిడ్జి పనులు ప్రారంభించినా పూర్తయ్యే వరకు రెండేళ్ల సమయం పడుతుంది.


