మంచిర్యాలఅర్బన్: పర్యావరణ పరిరక్షణ, జల కాలుష్య నివారణే ధ్యేయంగా మట్టి వినాయక ప్రతిమల తయారీ పెరిగింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ)తో తయారు చేసిన ప్రతిమలను చెరువులు, కుంటలు, జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతోంది. దీన్ని నివారించేందుకు కొన్నేళ్లుగా మట్టి ప్రతిమలను వివిధ ఆకర్షణీయమైన రూపాల్లో తీర్చిదిద్దుతున్నారు. ప్రజలకు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జి వద్ద తొమ్మిదేళ్లుగా అన్నదమ్ములు సంతోష్, రాజన్న మట్టి విగ్రహాల తయారీతో ఉపాధి పొందుతున్నారు. వివిధ రూపాలతో భక్తులను ఆకట్టుకునేలా, చూడముచ్చటగా గణపయ్యను తీర్చిదిద్దుతున్నారు. వినాయక చవితికి మూడు నెలల ముందు నుంచే గణపతుల తయారీలో నిమగ్నం అవుతారు. మూడు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల ఎత్తున్న ప్రతిమలను తయారు చేశారు. మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన మట్టి, గడ్డి, కర్రలను ఉపయోగించి సిద్ధం చేశారు. ముందస్తు ఆర్డర్లతో మట్టి వినాయకులు తయారు చేసి ఉపాధి పొందుతున్నామని రాజన్న తెలిపారు.
ప్లాస్టిక్‌కూ దూరమే..
మంచిర్యాలటౌన్: మంచిర్యాల హైటెక్‌సిటీ కాలనీవాసులు ఎనిమిదేళ్లుగా హరిహర క్షేత్ర దేవాలయంలో మట్టి గణపతికి పూజలు చేస్తున్నారు. మండపంలో పూజలు జరిగే రోజుల్లో ప్లాస్టిక్ వస్తువులనూ వినియోగించరు. పేపర్లు, ఆకులతో చేసిన వాటిని ప్రసాదాలు, నీరు తాగేందుకు వినియోగిస్తారు. మండపాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థలు, కులసంఘాలు మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తున్నాయి.
చిట్టిచేతులతో గణనాథులు
మంచిర్యాలఅర్బన్: పాఠశాలలో తరగతి గదులకే పరిమితం కాకుండా కాలుష్య నివారణకు విద్యార్థులు చిట్టిచేతులతో మట్టిగణపతులు తయారు చేసి సృజనాత్మకతను చాటారు. జిల్లా విద్యాశాఖ, నేషనల్ గ్రీన్‌కోర్, జిల్లా సైన్స్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం మట్టి గణపతి తయారీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలకు చెందిన 122 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మట్టిగణపతులను తీర్చిదిద్దారు. బంక మట్టి తీసుకువచ్చి వినాయకులను తయారు చేయించారు. పర్యావరణ హిత వినాయకులనే పూజించాలని జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ సూచించారు. న్యాయనిర్ణేతలు చక్కటి ప్రతిమలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మమత అధ్యక్షురాలు జ్యోత్స్న, బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సుధారెడ్డి, ఎన్‌ఆర్ పద్మజా, ఏ.సత్యనారాయణమూర్తి, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేతన, సునిత, కల్పన, గీత పాల్గొన్నారు.
మూడు నుంచి ఎనిమిది అడుగులు..
స్వచ్ఛంద సంస్థల పంపిణీ


