పాతమంచిర్యాల: పేదలకు వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. భవనం శిథిలావస్థకు చేరిందని, ఏ ప్రమాదం జరుగుతుందోనని వైద్యులు, సిబ్బంది, రోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. డయాలసిస్ వార్డులో స్లాబ్‌కు మెష్ కట్టి వైద్యం చేస్తున్నారని, వైద్యులు లేక శస్త్రచికిత్సలు చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. కాలేజీరోడ్‌లోని నూతన ఆస్పత్రి భవనంలోనికి మార్చాలని తెలిపారు. బీజేపి నాయకులు ఆమిరిశెట్టి రాజ్‌కుమార్, రంగ శ్రీశైలం, కుర్రె చక్రవర్తి, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, బొట్ల సత్యం, బాపు పాల్గొన్నారు.


