దండేపల్లి: రైతులు పండించిన వరి ధాన్యం సేకరణకు ప్రభుత్వం ప్రతియేటా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. గత యాసంగి సీజన్‌లో జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్, మెప్మా ఏజెన్సీలకు ఆయా కేంద్రాల బాధ్యతలు అప్పగించింది. కొనుగోలు కేంద్రాల నిర్వహణతో ఎంతో కొంత కమీషన్ వస్తుందని ఆశించిన నిర్వాహకులకు ఇప్పుడు గన్నీ సంచుల లెక్క భారంగా మారింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం(ఎఫ్‌ఏక్యూ) తూకం వేసి బస్తాలను లారీల్లో నింపి మిల్లులు, గోదాములకు పంపించారు. మిల్లర్లు, గోదాం ఇన్‌చార్జీలు తరుగు పేరిట ఒక్కో లారీకి సుమారు 10 నుంచి 20 బస్తాల వరకు కోత విధించినట్లు సమాచారం. కోత విధించిన గన్నీ సంచులు లెక్కకు రాకపోవడంతో వాటి డబ్బులను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే చెల్లించినట్లు తెలిసింది.
తీరని లోటు
సివిల సప్లయి అధికారులు నిర్వహించే రీకాన్సిలేషన్(లెక్కలు సరిచూసే) సమయంలో ప్రభుత్వం ఇచ్చిన గన్నీ సంచుల లెక్కలను పక్కాగా చూపించాల్సి ఉంటుంది. మిల్లర్లు, గోదాం ఇన్‌చార్జీలు తరుగు పేరుతో కోత విధించిన గన్నీ సంచుల లెక్క తేలకపోవడంతో ఆ నష్టాన్ని అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై రుద్దినట్లు తెలిసింది. ఒక్కో కొత్త సంచికి రూ.80, పాతదానికి రూ.40పైనా చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొందరు తగ్గిన గన్నీ సంచుల డబ్బులు చెల్లించలేక బయట కొనుగోలు చేసి అప్పగిస్తున్నారు. మరికొందరు కమీషన్ నుంచి మినహాయించుకోవాలని లేఖలు ఇచ్చినట్లు తెలిసింది.
భారం మోపెడు..
50 నుంచి వంద లారీలకు పైగా ధాన్యాన్ని పంపిన కేంద్రాల్లో తక్కువ వచ్చిన గన్నీ సంచుల భారం తడిసి మోపైడెంది. కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్‌లో సగానికి పైగా గన్నీ సంచుల నష్టాన్ని పూడ్చుకోవడానికే సరిపోయినట్లు తెలిసింది. కష్టపడి పని చేసినందుకు వచ్చిన కమీషన్‌లో సగానికి పైగా నష్టపోతుండడంతో కొందరు నిర్వాహకులు మాకొద్దు బాబోయ్ కొనుగోలు కేంద్రాలు అనే స్థితికి వచ్చారు. ప్రభుత్వం స్పందించి మిల్లర్లు, గోదాం ఇంచార్జీల అక్రమ కోతలకు అడ్డుకట్ట వేసి గన్నీ సంచుల లెక్కల్లో మినహాయింపు ఇవ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు.
జిల్లాలో గత యాసంగిలో కొనుగోళ్ల వివరాలు
కొనుగోలు రైతులు ధాన్యం ధాన్యం విలువ
కేంద్రాలు (మెట్రిక్ టన్నుల్లో) (రూ.కోట్లలో)
334 35,679 1,97,523 467.97


