పాత 3డీ నోటిఫికేషన్‌తోనే ముందుకు కొత్త నోటిఫికేషన్ అవసరం లేకుండానే చర్యలు హైకోర్టు ఆదేశాలతో రోడ్డు పనులకు అవకాశం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జాతీయ రహదారి(ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల) ఎన్‌హెచ్–63 నిర్మాణ పనులపై ఎన్‌హెచ్‌ఏఐకి భారీ ఊరట కలిగింది. భూ సేకరణపై దాఖలైన పిటిషన్లపై తాజాగా స్టే వచ్చింది. పిటిషనర్లు రెండు సార్లు హాజరు కాకపోవడంతో మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది. జాతీయ రహదారిలో భూమి కోల్పోతున్న కొందరు రైతులు నేషనల్ హైవే అలైన్‌మెంటు మార్పు, భూ సేకరణలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. మొదట దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. గత జూలై 6న రోడ్డు అలైన్‌మెంటు మార్పునకు నిరాకరిస్తూ ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. భూసేకరణలో కీలకమైన 3డీ నోటిఫికేషన్ అటవీ అనుమతులు రాకముందే ఇచ్చిన తీరుపై స్పందిస్తూ, అనుమతులు తీసుకున్నాక ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించింది. ఇటీవల మరోసారి విచారణ జరగగా నిర్వాసితుల తరఫున ఎవరూ కోర్టులో హాజరు కాలేదు. ఇప్పటికే రెండుసార్లు హాజరుకాకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. పిటిషనర్ల ప్రధాన అభ్యంతరాలైన రోడ్డు అలైన్‌మెంటు మార్పులో జోక్యం నిరాకరణతోపాటు 3సీ, 3డీ నోటిఫికేషన్లు జారీ చేశారని కోర్టుకు విన్నవించారు. అయితే అలైన్‌మెంటు మార్పు 3సీపై విచారణ చేసేందుకు కోర్టు నిరాకరించింది. చివరకు అటవీ అనుమతులు లేకుండానే 3డీ జారీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ తరఫున ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
పాత 3డీతోనే ముందుకు
ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం 3ఏ జారీ చేసిన ఏడాదిలోపే 3డీ సైతం జారీ చేయాలి. అప్పటికి అటవీ అనమతులు రాలేదు. 3డీ నోటిఫికేషన్ 2024 జూలై 18న రాగా, 2025 ఏప్రిల్ 26న పర్యావరణ అనుమతులు వచ్చాయి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ వాదనలు వినిపిస్తూ ఒకసారి 3డీ ఇచ్చాక రద్దు చేస్తూ మరోసారి ఇవ్వడం కుదరని కోర్టుకు వివరించింది. అంతేకాక హైకోర్టు కేంద్ర, రాష్ట్ర పరిధి అటవీ పర్యావరణ శాఖ స్టేజ్ 1, 2 అనుమతులు వచ్చాయని, ప్రజాప్రయోజనాల కోసం నిర్మించే రోడ్డుపై ఏడాదిలోపు పూర్తి చేయాలనే నిబంధనతో ముందుకు వెళ్లినట్లు వివరించారు. దీంతో కొత్తగా 3డీ నోటిఫికేషన్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. దీంతో పాత 3డీ నోటిఫికేషన్ ప్రకారం భూ సేకరణ పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 17గ్రామాల్లో భూ సేకరణ చేయాలి. కోర్టు కేసుల్లేని ఐదు గ్రామాలైన వేంపల్లి, పోచంపాడు, తిమ్మాపూర్, క్యాతనపల్లి, మంచిర్యాల నష్టపరిహారం చెల్లింపులు జరుగుతున్నాయి. మిగతా 12గ్రామాల్లో కోర్టు స్టే ఉండడంతో అవార్డు(పరిహారం) ప్రక్రియ నిలిచిపోయింది.
పనులు ప్రారంభమయ్యే అవకాశం
కోర్టు కేసులు, సాంకేతిక కారణాలతో రోడ్డు పనుల్లో జాప్యం జరుగుతున్నాయి. హైకోర్టులో తమకు అనుకూలంగా ఆదేశాలు వస్తున్న క్రమంలో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎన్‌హెచ్ అధికారులు చెబుతున్నా రు. దీంతో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్డు నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుంది. అయితే పంటలు కోల్పోతున్న రైతులు మాత్రం తమకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.


