● ధ్వంసమైన రహదారులు
● ఊరికి బస్సు వచ్చినా రోడ్లు అధ్వానం
● బస్సు డ్యామేజీకి సిబ్బంది వేతనాల్లో కోత ● జిల్లాలోని కొన్ని కొన్ని దారులు అధ్వానంగా మారి బస్సులు రద్దు చేయాల్సి వస్తోంది.
● మంచిర్యాల నుంచి ర్యాలీగడ్‌పూర్‌కు వెళ్లే ఏసీసీ స మీపంలో రాళ్లవాగుపై వంతెన దెబ్బతినడంతో బస్సులు వెళ్లే మార్గం లేక రద్దు చేశారు. వంతెన పూర్తి చేస్తే గానీ బస్సు నడిచే పరిస్థితి లేదు. గ్రామం నుంచి కూరగాయలు, పాల విక్రయదారులతోపాటు ఇతర పనుల నిమిత్తం వచ్చే వారు ప్రతామ్నాయ వాహనాలు ఎంచుకోవాల్సి వస్తోంది.
● రాజీవ్‌నగర్ మోడల్‌స్కూల్ వద్ద మట్టి ఉండడం వల్ల బస్సు టైర్లు కూరుకుపోతున్నాయి.
● దహెగాం, మెట్‌పల్లికి వెళ్లే మార్గమధ్యంలో కల్వడ వద్ద రోడ్డు డ్యామేజీ ఎక్కువగా ఉంది. గుంతల రోడ్లు కావడంతో బస్సుల బంపర్ నేలకు తగులుతుండడంతో డ్రైవర్లు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.
● బొప్పారం రోడ్డు కొంతమేర మట్టి కావడంతో ఇ బ్బందులున్నాయి. పంగిడి సోమారం వెళ్లే బస్సులు సాఫీగా రాకపోకలు సాగించాలంటే దారికి ఇరువైపుల చెట్ల పొదలు తొలగించాల్సి ఉంది.
● దౌడపల్లి, కొమ్ముగూడేంకు వెళ్లే రహదారి దాదా పు 5కిలోమీటర్ల మేర పూర్తిగా ఆధ్వానంగా మారింది.
● వర్షం కురిస్తే బలరావుపేట్‌కు బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని గ్రామాలకు వెళ్లే రహదారులు తీవ్రంగా దెబ్బతిని గుంతలమయంగా మారాయి. రోడ్ల నిర్వహణను పాలకులు పట్టించుకోకపోవడంతో బస్సుల్లో ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి ప్రమాదం పొంచి ఉంటోంది. జిల్లాలోని 18మండలాలు, 58 రూట్లలో ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారి నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. పెద్ద పెద్ద గుంతల్లో బస్సు బంపర్లు, అడుగు భాగం కింద తగిలి దెబ్బతింటున్నాయి. బస్సుకు ఏదైనా ప్రమాదం, డ్యామేజీ జరిగితే మరమ్మతు ఖర్చులను డ్రైవర్ల జీతాల నుంచి కోత విధిస్తున్నారు. దీంతో గుంతలు ఉన్న రూట్లలో బస్సులు నడిపేందుకు డ్రైవర్లు విముఖత చూపుతున్నారు.
అధ్వాన రహదారులు
తక్కువ వేగం
గుంతలు ఉన్న రోడ్లపై బస్సును ఒకటి, రెండో గేర్‌లోనే నెమ్మదిగా నడపాల్సి వస్తోంది. గుంతలు దాటేటప్పుడు క్లచ్, బ్రేక్‌లను గట్టిగా తొక్కాల్సి రావడం, రాత్రి ప్రయాణాల్లో ఇ బ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం నీరు నిలిచి ఉన్న గుంతల్లో లోతు తెలియక బస్సు దింపడం వల్ల స్టీరింగ్ చేతిలోంచి జారిపోయే ప్రమాదం ఉందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.