మంచిర్యాలక్రైం: జిల్లాలో ఇటీవల నమోదవుతున్న మిస్సింగ్ కేసులు బాధిత కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిలిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు మళ్లీ తిరిగిరావడం లేదు. నెలలు, సంవత్సరాలైనా వారి ఆచూకీ తెలియడం లేదు. ఏమయ్యారో.. ఎక్కడున్నారో..జాడ తెలియక ఎదురుచూపుల్లో బాధిత కుటుంబాలు ఉంటున్నాయి. మహిళలు, యువతుల మిస్సింగ్ కుటుంబాలకు కలంకం తెచ్చి పెడుతోంది. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు ఇంటినుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేంత వరకు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. అదృశ్యమైన వారిలో సగం మంది ఆచూకీ లభిస్తుండగా.. మిగిలిన వారి మిస్సింగ్ మిస్టరీగానే మారి పోలీసులకు పెను సవాల్‌గా మారుతోంది. అదృశ్యమైన వ్యక్తుల జాడ తెలుసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిరావడం.. ఇది కొంత వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం కావడం, పైగా సిబ్బంది కొరత వల్ల కొంత జాప్యం జరుగుతోందనే ఆరోపనలున్నాయి. ఇప్పటికై నా పోలీసులు మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
జంటలుగా తిరిగివస్తున్న వైనం..
తెలిసీ తెలియని వయసులో కొందరు.. వ్యామోహంలో కొందరు.. వివాహేతర సంబంధాలతో కొందరు.. ప్రేమ ముసుగులో కొందరు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతున్నారు. విషయం తెలియక బాధిత కుటుంబాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో చాలా మట్టుకు వివాహం చేసుకుని కొన్ని నెలల తర్వాత పోలీస్‌స్టేషన్‌కు జంటలుగా తిరిగివస్తున్నారు. అదృశ్యమైన వారిలో మహిళల సంఖ్యనే ఎక్కువ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
కుటుంబ సమస్యలు, వివాహేతర
సంబంధాలు
ఇటీవల అదృశ్యమైన కేసుల్లో కుటుంబ సమస్యలు, వివాహేతర సంబంధాలతోనే గడప దాటుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. కొందరైతే కన్నబిడ్డలను సైతం వెంట తీసుకెళ్తున్నారు. ఇలాంటి వారి ఆచూకీ లభించకుండా మిస్టరీగా మిగిలిపోయిన ఘటనలు ఉండడం గమనార్హం.


