మంచిర్యాలటౌన్: జిల్లాలో అత్యధికంగా ధర పలుకుతున్న హైటెక్‌సిటీ కాలనీకి చెందిన స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాలనీవాసులు ఆందోళనబాట పట్టారు. 2006లో హైటెక్‌సిటీ లేఔట్ చేసి అనుమతులను పొందే సమయంలో పది శాతం భూమిని ప్రజావసరాల కోసం కేటాయించాలనే నిబంధన మేరకు ఎకరం ప్రాథమిక పాఠశాలకు, 1.10 ఎకరాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం వదిలేశారు. 20 ఏళ్లుగా పాఠశాల, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను చేపట్టక పోవడంతో ఆ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. హైటెక్‌సిటీ కాలనీలో గజానికి రూ.35 వేలకు పైగా ధర పలుకుతుండగా, వీటి విలువ రూ. 40 కోట్లకు పైగానే ఉండడంతో, లేఔట్ నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలాలను అమ్ముకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కాలనీవాసులు గుర్తించారు. విలువైన భూములను కాపాడాలని ఆందోళనబాట పట్టారు.
కాలనీ అసోసియేషన్ రద్దు మతలబేంటో?
హైటెక్‌సిటీ కాలనీని 68.95 ఎకరాల స్థలంలో లేఔట్ చేసి, ప్లాట్లు అమ్ముకున్నారు. 2006లోనే హైటెక్‌సిటీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించారు. రెండేళ్లకోసారి కమిటీని ఎన్నుకుంటుండగా, గతేడాది ఎన్నుకున్న కమిటీని కొద్ది రోజులకే రద్దు చేశారు. గత కమిటీ సభ్యులు కాలనీకి చెందిన భూములను కబ్జా చేయకుండా అడ్డుకోవడం, అధికారులకు తరచూ ఫిర్యాదు చేయడంతోనే గత కమిటీని రద్దు చేశారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గత కమిటీ రద్దై ఆర్నెల్లు దాటినా కొత్తగా కమిటీని ఎన్నుకోక పోవడం, ప్రాథమిక పాఠశాల స్థలం చుట్టూ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేయడం, కమ్యూటీ హాల్ నిర్మాణం కోసం 2024లోనే భూమి పూజ చేసినా, నిర్మాణ పనులు జరగకుండా లేఔట్ నిర్వాహకులు అడ్డుకోవడం ఆయా స్థలాలను కబ్జా చేసే కుట్రలో భాగమనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.


