కార్మికుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు ఆ రెండు పార్టీలకు లేదు వచ్చే నెల మరో శుభవార్త వినిపిస్తా.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి
శ్రీరాంపూర్/రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థను గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకోగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ–3 గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. క్యాతనపల్లిలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన సభలోనూ ఆయన ప్రసంగించారు. సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కంపెనీలో 70వేల మంది కార్మికులు ఉంటే నేడు 38వేలకు చేరారని అన్నారు. 51శాతం వాటాతో సింగరేణిలో నిర్ణయాధికారాలను రాష్ట్రం ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుని పెత్తనం చేస్తోందని తెలిపారు. నాడు కేసీఆర్ కుటుంబం, నేడు రేవంత్ సర్కార్ సింగరేణిని బంగారు బాతును చేసి పంచుకున్నాయని అన్నారు. సింగరేణి వద్ద ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు బొగ్గు కొనుగోలు చేసి సక్రమంగా డబ్బులు చేల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు బకాయిలు పెట్టిందని తెలిపారు. నెల వేతనాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక బ్యాంకుల వద్దకు అప్పులకు వెళ్తోందని అన్నారు. తాడుచెర్ల–2 బొగ్గుబ్లాక్‌తో సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని తెలిపారు. ఇందులో 350 మిలియన్ టన్నుల నిక్షేపాలు వెలికితీయవచ్చని, రెండు వేల మంది శాశ్వత, ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభిస్తాయని, 45 ఏళ్లు కొనసాగుతుందని వివరించారు. వచ్చే నెలలో కూడా సింగరేణికి శుభవార్త చెబుతానని హామీనిచ్చారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి టీబీజీకేఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.


