మంచిర్యాలఅర్బన్: యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్లు, పాఠ్యపుస్తకాలు, వీల్‌చైర్లు, రాగిపిండి బస్తాలతో నిండి స్టోర్‌రూమ్‌లా కనిపిస్తున్న పైచిత్రం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రం నిర్వహిస్తున్న గది. ప్రత్యేకావసరాలుగల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇరుకు గదిలో నిర్వహిస్తుండగా ఇక్కడకు వచ్చే 18మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు ఆడిపాడాల్సిన గదిని సామగ్రితో నింపుతున్నారు. ఇదే గదిలో స్పీచ్ థెరపీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇది విద్యార్థుల అభ్యాసంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల గదులున్నా ఇవ్వరు
స్టేషన్ రోడ్ పాఠశాల గదుల కేటాయింపుపై అధికారులు తాత్సారం చేస్తున్నారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలో అదనపు తరగతి గదులు నిర్మించారు. అప్పట్లో కలెక్టర్ ఓ గదిలో సైన్స్ కేంద్రం ఏర్పాటు చేశారు. మరో గదిలో కంప్యూటర్ మాత్రమే ఉంటుంది. సమ్మర్‌లో సైన్స్ క్యాంపులు మినహాయిస్తే ఇతర కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సైన్స్ పరికరాలు అంతంత మాత్రంగానే మారాయి. దీనికి తోడు చిన్న కంప్యూటర్ పెట్టేందుకు ఏకంగా గదిని ఆక్రమించారు. ఈ గదిలో కంప్యూటర్ సైన్స్ కేంద్రం గదిలోకి మార్చి సర్దుబాటు చేయవచ్చు. సైన్స్ కేంద్రంపైనున్న గదులు అప్పట్లో ఖాళీగా ఉండటంతో క్రీడలశాఖ, వయోజన కార్యాలయాల కోసం వినియోగించారు. ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక గదులు కేటాయించారు. విద్యార్థుల అవసరాల కోసం నిర్మించిన గదులకు తాళం పెడుతున్నారనే గాని పాఠశాల విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రం అభ్యంతరం వ్యక్తంజేస్తున్నారు. ఓవైపు అడ్మిషన్లు పెంచాలని చెబుతున్న ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న పాఠశాలలకు సరిపడా గదులు కేటాయించక పోవటంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్టేషన్‌రోడ్ స్కూల్ విద్యార్థుల ఇక్కట్లు
స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేషన్‌రోడ్ స్కూల్‌కు చెందిన రెండోతరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం భవిత కేంద్రంలో కూర్చోబెట్టగా.. మంగళవారం పాఠశాల ఆవరణలోనే వారికి పాఠాలు బోధించా రు. స్టేషన్‌రోడ్‌లో ఆరు తరగతులకు మూడు గదులు కేటాయించారు. విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 182కు చేరడంతో ఒకే గదిలో రెండేసి తరగతులకు బోధిస్తున్నారు. ఇటీవలే ప్రీప్రైమ రీ పాఠశాల మంజూరైంది. కంప్యూటర్ పరికరాలు కూడా రావడంతో గది ఇరుకుగా మారింది. దీంతో రెండో తరగతి నిర్వహించిన గదిలోనే ప్రీప్రైమరీ, ఒకటో తరగతి పిల్లలకు బోధిస్తూ రెండో తరగతి విద్యార్థులను భవిత కేంద్రానికి తరలించారు.


