నస్పూర్: మంచిర్యాల నగరంలోని నస్పూర్‌లో పలు కాలనీల్లో గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో దుర్వాసనతో కూడిన దట్టమైన పొగ కమ్మేసింది. రోడ్డుపై వచ్చే వారు ఒకరికి మరొకరు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఏం జరిగిందోనని ప్రజలు ఆరా తీస్తే డంప్ యార్డులో చెత్త తగులబడి పొగ వెలువడినట్లు తేలింది. నస్పూర్ ఏరియాకు చెందిన 2, 24, 25, 26, 27, 28 డివిజన్ల ప్రజలు ఇబ్బంది పడడం పరిపాటిగా మారింది. రాత్రయిందంటే చాలు సీసీసీ ఆర్‌కే 5 కాలనీ సమీపంలోని డంప్‌యార్డు నుంచి వెలువడే దుర్వాసనతో కూడిన పొగ కాలనీలను కమ్మేస్తోంది. రాత్రి 7గంటలు అయిందంటే ప్రజలు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. కాలుష్యంతో నిండిన పొగను పీల్చడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూనాగార్జున కాలనీలోని ప్రాణహిత స్టేడియంలో ఉదయం, సాయంత్రం వాకర్లు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతీరోజు 67 మెట్రిక్ టన్నుల చెత్త
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతీ రోజు 67 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. ఇందులో 9.38 మెట్రిక్ టన్నులు తడి చెత్త, 17.42 మెట్రిక్ టన్నులు పొడి చెత్త, 40.20 మెట్రిక్ టన్నుల మిక్స్‌డ్ చెత్త ఉంటోంది. చెత్త సేకరణకు 80 స్వచ్ఛ ట్రాలీలు, 21ట్రాక్టర్లు వినియోగిస్తుంటారు. సేకరించిన చెత్తను నస్పూర్‌లోని ఆర్‌కే 5 కాలనీ సమీపంలోని డంప్ యార్డు, మంచిర్యాలలోని ఆండాళమ్మ కాలనీలోని డంప్‌యార్డుకు తరలిస్తారు. సిబ్బంది ప్రతీ రోజు తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చి ఇతర అవసరాలకు వినియోగించాలి. కానీ కార్పొరేషన్ అధికారులు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో డంప్ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. చెత్తను ఎరువుగా మార్చి పేరుకుపోకుండా చేసి సమస్యకు పరిష్కారం చూపే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
సింగరేణి స్థలంలో..
నగరంలోని ఆండాళమ్మ కాలనీ, నస్పూర్ పరిధిలోని సీసీసీ ఆర్‌కే 5 కాలనీ సమీపంలో సింగరేణి సంస్థకు చెందిన సుమారు 10 ఎకరాల స్థలంలో చెత్త డంప్ యార్డులు ఉన్నాయి. నస్పూర్‌లోని డంప్ యార్డు స్థలాన్ని సింగరేణి అధికారులు అధికారికంగా గత మున్సిపాలిటీకి కేటాయించలేదు. దీంతో కార్పొరేషన్ సిబ్బంది ఆ స్థలంలో ప్రతీరోజు సేకరించిన చెత్తను డంపింగ్ చేస్తున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. చెత్త సేకరించేవారు, ఆకతాయిలు తరచూ చెత్తను కాలుస్తుండడంతో దుర్వాసన, పొగతో ఆర్‌కే 5, సీసీసీ టౌన్‌షిప్, నాగార్జున, న్యూనాగార్జున, షిర్కే, తాల్లపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, సింగాపూర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, సుందరయ్య కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డుకు సమీపంలో ముక్కిడి పోచమ్మ గుడి, చర్చిలకు వచ్చే భక్తులు, ఆర్‌కే 5 కాలనీలో వృద్ధాశ్రమంలోని వృద్ధులు అవస్థలు పడుతున్నారు.


