జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లో అగ్ని ప్రమాదాలతో అడవి తగులబడిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఆకులు రాలి ఎండిపోయిన ప్రాంతంలో చిన్న నిప్పురవ్వ కూడా అగ్నిగుండంగా మారుతోంది. డివిజన్‌లోని తాళ్లపేట, ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లలో ఇటీవల అగ్ని ప్రమాదాలు సంభవించి అడవి కాలిపోతోంది. ముందస్తుగా శాటిలైట్ ద్వారా స మాచారం అందడంతో అటవీ, బేస్‌క్యాంపు సిబ్బంది అడవిలోకి పరుగులు తీసి మంటలను అదుపు చేయాల్సి వస్తోంది. శాటిలైట్ ఇచ్చిన సమాచారం మేరకు నెల రోజుల వ్యవధిలో సుమారు 340 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించినట్లు తెలిసింది. గత మంగళ, బుధవారాల్లో ఇందన్‌పల్లి, తాళ్లపేట్, జ న్నారం అటవీ రేంజ్‌లలో 52చోట్ల అగ్ని ప్రమాదా లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత బీ ట్ అధికారితోపాటు బేస్‌క్యాంపు సిబ్బంది బ్లోయర్ల సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు.
ఒకే రోజు 28 చోట్ల
జన్నారం అటవీ డివిజన్‌లోని ఇందన్‌పల్లి, తాళ్లపేట రేంజ్‌లలో బుధవారం ఒకే రోజు 28 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. కావాలనే అడవిలో నిప్పు రగుల్చుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందన్‌పల్లి రేంజ్‌లో గడ్డిమైదానం ప్రాంతంలో 19చోట్ల నిప్పు పెట్టడంతో రేంజ్ సిబ్బంది, ఎఫ్‌డీవో రాంమోహన్, రేంజ్ అధికారి లక్ష్మినారాయణ మంటలను అదుపులోకి తేవడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గడ్డిమైదానం కావడంతో గడ్డి తగులబడిపోవడమే కాకుండా తిరిగి మొలిచే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. దీనికి తోడుగా కింద పడిన చెట్ల విత్తనాలు కూడా కాలిపోతాయి. పక్షుల గూళ్లు, జంతువుల ఆవాసాలు తగులబడిపోయి పక్షులు, వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగుతాయి. కావాలని నిప్పు పెట్టిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మానవత్వంతో ఆలోచించాలి
వేసవిలో కొందరు కావాలనే అడవిలో నిప్పు వేస్తున్నారు. దీంతో అడవి కాలి పక్షులు, వన్యప్రాణులకు ఇబ్బంది ఏర్పడుతుంది. అడవి ఎదుగుదల ఆగిపోతుంది. మానవత్వంతో ఆలోచించి నిప్పు వేయకుండా చూడాలి. సిగరేట్, బీడీ, అగ్గిపెట్టే వంటివి అడవిలోకి తీసుకెళ్లకుండా చూడాలి. అడవిలో నిప్పు పెడితే ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– లక్ష్మినారాయణ, రేంజ్ అధికారి
బేస్‌క్యాంపు సిబ్బంది సర్కస్ ఫీట్లు
శాటిలైట్ సమాచారం అందింన వెంటనే సంబంధిత బీట్ అధికారి కంపార్టుమెంటు ప్రాంతం చెప్పి బేస్‌క్యాంపు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. వారు వెంటనే బ్లోయర్లతో ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు ఇతర ప్రాంతానికి వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎగిసిపడే మంటలను అదుపు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తాళ్లపేట్ రేంజ్ ఊట్ల ప్రాంతంలో గుట్టపై మంటలు వ్యాపించడంతో 700మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపైకి బేస్‌క్యాంపు సిబ్బంది వెళ్లి మంటలు ఆర్పేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చింది. అటవీ సిబ్బంది సకాలంలో స్పందించకుండా, ఆ ప్రాంతానికి చేరుకోకపోవడంతోనే ప్రమాదం ఎక్కువగా అవుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత అధికారులు దృష్టి సారించి అడవి తగులబడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.


