
సమస్యలు పరిష్కరించడంలో విఫలం
నస్పూర్: సింగరేణి కార్మికవాడల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ)రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే 6 కాలనీ, నస్పూర్ డిస్పెన్సరీ ఏరియాలోని కాలనీల్లో ఆదివారం ఆయన బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. కాలనీల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మిక కుటుంబాలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పలు క్వార్టర్లలో ఊరుస్తోందన్నారు. వర్షపు, డ్రెయినేజీ నీరు ఇళ్లలోకి చేరడంతో సామగ్రి తడిసిపోవడంతో కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. శ్రీరాంపూర్ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజి, బ్రాంచ్ నాయకులు పాల్గొన్నారు.