
రాసేవారు ‘లేఖ’!
నిర్మల్‌ఖిల్లా: సర్ పోస్టు..మేడమ్ పోస్టు..పల్లెల్లోకై న, పట్టణాల్లో ఉత్తరాలు మోసుకొచ్చే వారధి పోస్టుమాన్. సైకిల్‌పై వచ్చి బెల్ మోగిస్తూ చేతిలో ఉత్తరాన్ని పెడితే చదవాలనే ఆతృత ఉండేది. సైన్యంలో పహారా కాస్తున్న జవాను.. తల్లిదండ్రులు, భార్యకు లేఖ ద్వారా ఇచ్చిన సందేశం. నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న కబురందించే ఉత్తరం. మనసులో మాటను చెప్పలేక కవితలు రాసిన ప్రేమ భావం. సెలవులకు పిల్లలతో కలిసి ఇంటికి రమ్మని పిలుస్తూ కూతురు, అల్లుడికి అందించే ఆహ్వానం. క్యాంటీన్ ఖర్చులు, పుస్తకాలకు డబ్బులు పంపమని నాన్నగారికి విన్నపం. ఇలా సందర్భమేదైనా అన్ని రకాల భావాలను అందించే లేఖ ప్రస్తుతం రాసేవారు కరువయ్యారు. మారుతున్న కాలంతోపాటు ఉత్తరం కనుమరుగైంది.
90వ దశకం వరకు..
జిల్లాలో 90వ దశకం వరకు ఉత్తరాల బట్వడా జో రుగా కొనసాగింది. ‘తోక లేని పిట్ట తొంబై ఆమడలు పోయే’, ‘రెక్కలు లేని పిట్ట గూటికి సరిగ్గా చేరింది’అంటూ చిన్నారులకు ఇంట్లో పెద్దలు, నానమ్మ, తాతయ్యలు ‘ఉత్తరం’పై పొడుపు కథలు అల్లేవారు. నాడు ఆత్మీయుల ప్రేమ, ఆశీర్వాదాలను, మోసుకొచ్చే ఉత్తరం కాలక్రమంలో కానరాకుండా పో యింది. పెరిగిన సాంకేతికత కారణంగా ఇది కాలగర్భంలో కలిసిపోయింది. వాటి స్థానాన్ని స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్, కొరియర్లు ఆక్రమించాయి.
కనుమరుగవనున్న ‘రిజిస్టర్డ్ పోస్టు సేవలు’!
1854 సంవత్సరం బ్రిటిష్ కాలంలో మన దేశంలోకి ప్రవేశపెట్టబడిన పోస్టుబాక్సులు ఇకపై కనుమరుగు కాానున్నాయి. 180 ఏళ్ల నుంచి పెనవేసుకున్న ఈ బంధం ఇక తెగిపోనుంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ప్రజలు పోస్టుబాక్సులు, ఉత్తరాలతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నారు. బంధువులు, స్నేహితులకు రాసిన ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, అభిమాన రచయితలు, సినీతారలకు రాసిన లెటర్స్‌తోపాటు ఊరుపేరు లేకుండా రాసే ఆకాశరామన్న ఉత్తరాలు ముందు ఈ పోస్టుబాక్సుల్లో పడేస్తే..అక్కడి నుంచి చేరాల్సిన చోటుకు చేరేవి. పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా పోస్టుబాక్సులు తొలగించనున్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు నిలిపివేయనున్నట్టు శాఖాధికారులు వెల్లడిస్తున్నారు. రెండు దశాబ్దాల నుంచి ఇంటర్నెట్, డిజిటల్ కమ్యూనికేషన్ల వల్ల సాధారణ రిజిస్టర్ పోస్టులు, పోస్టు బాక్సుల ఉపయోగం గణనీయంగా తగ్గిపోయింది. ఇకపై ఈ సేవను స్పీడ్‌పోస్ట్‌లో విలీనం చేయడం ద్వారా, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ట్రాకింగ్‌లో మరింత ఖచ్చితత్వాన్ని, డెలివరీ వేగాన్ని, ఆపరేషనల్ ఎఫిషియన్సీని మెరుగుపర్చాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తపాలా సేవల్లో మార్పులు
తపాలా సేవలో మార్పులు వచ్చాయి. ఒకనాడు ఉత్తరాల బడ్వాడాకు, మనీ ఆర్డర్లు పంపేందుకు, పొదుపు పథకాలు అందించేందుకు ప్రధాన కేంద్రాలుగా పోస్టాఫీసులు ఉన్నాయి. నేడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు సేకరిస్తూ, బీమా పాలసీలు అందిస్తూ బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. ప్రజలు కూడా అందివచ్చిన టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్లకు అలవాటుపడ్డారు. సెల్‌ఫోన్లు విరివిగా వినియోగించడం వంటి కారణాలతో ఉత్తరాలు కనుమరుగయ్యాయి. పార్సిళ్ల వంటివి పంపాలంటే ప్రైవేటు సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో పోస్టుకార్డులు, ఇన్‌లాండ్, బుక్‌పోస్టు లెటర్లు కనిపించడం లేదు.