
ఉచితాలు అనర్ధదాయకమని ఆర్ధిక నిపుణులు, సుప్రీం కోర్టు మొత్తుకుంటున్నా ప్రభుత్వాలకు పట్టడంలేదు. అధికారంలోకి రావడానికి ప్రజలపై ఉచితాల వల వేస్తున్న వైనం ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. కర్ణాటక, తెలంగాణతో పాటు మరికొన్ని చోట్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ సక్సెస్ అవ్వడం మాట అటుంచి.. తీవ్ర విమర్శలకు తావిస్తోన్న సంగతి తెలిసిందే. నిత్యం ప్రయాణికుల శాపనార్థాలతో సాగుతున్నాయి ఆయా పథకాలు.

తాజాగా.. ఏపీలో తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి అది ఎంతో టైం పట్టలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ కొర్రీలతో.. ఏ బస్సుకు ఉచితం వర్తిస్తుందో స్పష్టత లేక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. పైగా వరుస సెలవుల టైంలోనే పరిమిత సంఖ్యలో.. విపరీతమైన రద్దీతో.. ప్రయాణికులను ఆర్టీసీ అష్టకష్టాలకు గురి చేస్తోంది.




















