
ఆలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో శనివారం చోరీ జరుగగా నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్నట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోలీస్‌స్టేషన్లో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆర్చకుడు ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల హుండీ పగులగొట్టి కానుకలను చోరీ చేశారు. కాగా, ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. క్యాతనపల్లిలో అనుమానాస్పదంగా నలుగురు కనిపించారని, వారు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అందులో ముగ్గురిని పట్టుకున్నామని తెలిపారు. వారిని విచారించగా చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నారని, వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులు కుంటాల భీమయ్య, మడక చిరంజీవి, కడమంచి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.