మంచిర్యాలఅగ్రికల్చర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్‌తోపాటు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు గురువారం ముస్తాబయ్యాయి. కలెక్టరేట్ ఆవరణలో టెంట్లు, శామియానాలు, అతిథులకు కుర్చీలు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ పతాకావిష్కరణ, వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు తెలియజేసే స్టాళ్లు ఏర్పాటు, ముఖ్య అతిథి ప్రసంగం, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు గౌరవ వందనం సమర్పణ, ప్రగతి నివేదిక సందేశం, ప్రశంసాపత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు ఉంటాయి.
జిల్లా నుంచి మంత్రి ఉన్నా..
జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా.. గతంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండావిష్కరణకు ప్రభుత్వ సలహాదారుకు సర్కారు అవకాశం కల్పించింది. ప్రస్తుతం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా గడ్డం వివేక్‌వెంకటస్వామి ఉన్నారు. అయినప్పటికీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎగురువేసే అవకాశం ఇతర ప్రాంతానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావుకు కల్పి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కు చెందిన మంత్రికి అవకాశం కల్పించకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.