
పాటాగూడలో తొలిసారి ఎగిరిన జెండా
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని పాటాగూడ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇది మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. జోడేఘాట్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. అవి కూడా వెళ్లని పక్షంలో వారికి కాలినడకే శరణ్యం. ఆ గ్రామంలో ఇప్పటివరకు బడి, అంగన్‌వాడీ కేంద్రం లేదు. దీంతో ఇప్పటివరకు జెండా ఎగురవేయలేదు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా చొరవతో ఇటీవల గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. ఇందులో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో సీఆర్టీ చంద్రకళ త్రివర్ణపతాకం ఎగురవేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తంజేశారు.