
‘హమాలీల సమస్యలు పరిష్కరిస్తా’
బెల్లంపల్లి: హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్‌లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీ సంఘం నాయకులను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అసంఘటిత కార్మికుల మాదిరిగానే ఫీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం హమాలీలు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతకుముందు బజారు ఏరియా ప్రాంతం నుంచి పుర వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు, నియోజకవర్గ అధ్యక్షులు, హమాలీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.