
అభినవ పోతన.. వరదన్న
చెన్నూర్: తెలుగు రాష్ట్రాల్లో సాహితీ రంగంలో వానమామలై వరదాచార్యులు కీర్తి గడించారు. ఓ వైపు సాహిత్యంలో, మరోవైపు రాజకీయంలో రాణించా రు. వరదన్న చేతి నుంచి జాలు వారిన రచనలు ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి, ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. వరదాచార్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పని చేశారు. నేడు వరదా చార్యుల జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
జననం.. విద్యాభ్యాసం
వరదాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో 16 ఆగస్టు 1912లో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు జన్మించారు. తండ్రి బక్కయ్యశాస్త్రి చెన్నూర్‌లో ఉపాధ్యాయునిగా పని చేశారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. వరదాచార్యులకు చదువు అబ్బలేదు. ఆయన సహజ కవి. 13వ ఏటా పద్యాలు, కవితలు, రచనలు ప్రారంభించారు. డిగ్రీలు లేని పండితుడు కావడంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్‌లోని దోమకొండ జనతా కళాశాలకు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించారు. అనంతరం వానమామలై ఆంధ్ర సారస్వత పరిషత్‌లో విశారద రాసి ఉత్తీర్ణులయ్యారు. వరదాచార్యులు రాసిన ‘మణిమాల’ విశారద పరీక్షలో పాఠ్యాంశంగా ఉంది. అది చదివే పరీక్ష రాశారు. బాలల కోసం అనే బుర్రకథలు, నాటికలు రచించారు. దోమకొండ నుంచి చెన్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేయించుకుని 1961 నుంచి 1972 వరకు విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు.
కవి ప్రస్థానంలో..
చెన్నూర్ పట్టణానికి చెందిన వానమామలై వరదాచార్యుల 50 ఏళ్ల కవి ప్రస్థానంలో ఎన్నో రచనలు చేశారు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, ఆంధ్రకవి, వసంత, మధుకవి, కవికోయిల, ఉత్ప్రేక్షా చక్రవర్తి, మహాకవి శిరోమణి, కవిశిరోవసంత లాంటి బిరుదులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. షష్టిపూర్తి సందర్భంగా భారతీ సాహిత్య సమితి కరీంనగర్ జిల్లా కోరుట్లలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గండపెండేరం, స్వర్ణకంకణం, రత్నాభిషేకం చేశారు. పూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారణాసి వారు విద్యావాచస్పతి (డిలిట్) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇలా అనేక రాష్ట్రాల్లో మరెన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ఆయన అనేక రచనలు ముద్రితం కాగా, కొన్ని ముద్రణకు నోచుకోలేదు.
రాజకీయ ప్రస్థానంలో..
18 ఏళ్ల పాటు అధ్యాపకునిగా పని చేసిన వరదాచార్యులును అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం పీవీ నరసింహారావు 1972లో ఎమ్మెల్సీగా అవకాశమివ్వగా 1978 వరకు పని చేశారు. చెన్నూర్‌లో వేదపాఠశాల ఏర్పాటు చేసి అధ్యక్షునిగా పని చేశారు. 31 అక్టోబర్ 1984లో ఆయన తుదిశ్వాస విడిచారు.

అభినవ పోతన.. వరదన్న