
భార్యతో గొడవపడ్డందుకు చితకబాదిన ఎస్సై!
వేమనపల్లి: భార్యతో గొడవపడ్డందుకు తనను ఎస్సై చితకబాదాడని మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య ఆరోపించాడు. ఈ మేరకు ఎస్సైపై ఆరే కుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశంతో కలిసి సీపీ, డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య నాలుగేళ్ల క్రితం నీల్వాయి కొత్త కాలనీకి చెందిన భారత ప్రమీలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రమీల పుట్టింటికి వెళ్లడం, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన అనంతరం తిరిగి కాపురానికి రావడం జరుగుతుండేది. 20 రోజుల క్రితం అనారోగ్యంతో ప్రమీల పుట్టింటికి వెళ్లింది. దీంతో కిష్టయ్య గత ఆదివారం ఆమె వద్దకు వెళ్లి కాపురానికి రావాలని గొడవ పడ్డాడు. దీంతో ప్రమీలతోపాటు ఆమె తల్లిదండ్రులు నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై సురేశ్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేశాడు. అయితే గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశ్ ద్వారా రూ.10వేలు ఇవ్వాలని ఎస్సై తనను డిమాండ్ చేసినట్లు కిష్టయ్య ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన భార్య, అత్తమామలు, మరికొందరి ముందే ఎస్సై తనను రోకలిబండతో తీవ్రంగా కొట్టాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయమై మూడురోజుల క్రితం రూరల్ సీఐ బన్సీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. శుక్రవారం రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీకి పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించినట్లు పేర్కొన్నాడు. ఎస్సై సురేశ్‌తో తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.