
పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ)ల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం హాజీపూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్ రిజిష్టర్లు, పరిసరాలు పరిశీలించి రోగులతో మాట్లాడారు. కర్ణమామిడిలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి స్వప్న, పీహెచ్‌సీ వైద్యాధికారి లహరి పాల్గొన్నారు.
వార్షిక పాస్ సద్వినియోగం చేసుకోవాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జాతీయ రహదారుల సంస్థ కల్పించిన వార్షిక పాస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో జాతీయ రహదారుల సంస్థ మంచిర్యాల పీఐయూ డిప్యూటీ మేనేజర్ హర్షకుమార్ గుప్తా, అధికారులతో కలిసి వార్షిక పాస్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడతూ దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై వర్తించేలా ఈ నెల 15 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.
ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం
మంచిర్యాలటౌన్: ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్ చెరువును డీసీపీ ఏ.భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబో యే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 90 మంది సభ్యులతో మూడు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, శిక్షణ పొందిన పోలీసులు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.