
దొంగ ఓట్లతో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం
మంచిర్యాలటౌన్: దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ విమర్శించారు. దొంగ ఓట్లను ఆధారాలతో సహా బయటపెట్టినా ఎన్నికల సంఘం, బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఓట్ చోర్.. గద్దె చోడ్(ఓట్ల దొంగలు గద్దె దిగండి) ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా మీదుగా గురువారం సాయంత్రం మాస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మట్లాడుతూ ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓటర్లు ఉండడం, ఓటర్లుగా ఉన్నవారిని మృతిచెందినట్లుగా చిత్రీకరించడం వంటివి బీజేపీ చేపట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.