
రాంనగర్ వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణం
బెల్లంపల్లి: వర్షాకాలంలో వరద నీరు ముంచెత్తి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రాంనగర్ వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం పట్టణంలోని రాంనగర్ వాగు వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. వాగుపై సరైన వంతెన లేకపోవడంతో వరద నీరు ఇళ్లలోకి వస్తోందని, ఏటా తమకు వరద కష్టాలు తప్పడం లేదని స్థానికులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఏమాత్రం జాప్యం చేయకుండా కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు కాంట్రాక్టర్‌తో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేష్‌ను ఆదేశించారు. చైన్ మిషన్ ద్వారా వాగులో పూడిక తీయించి వరద ముప్పును నివారించాలని సూచించారు. రాంనగర్ బస్తీ వాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘ఎల్లంపల్లి’లో పెరిగిన నీటిమట్టం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట వద్ద ఉన్న ఎల్లంపల్లి(శ్రీపాద సాగర్) ప్రాజెక్ట్ నీటిమట్టం మూడు టీఎంసీల మేర పెరిగింది. ఎగువ ప్రాంతాలు, కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరద నీటితో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను గురువారం 15.750 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. కడెం ప్రాజెక్ట్ నుంచి 5,775 క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 4,100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 277 క్యూసెక్కులు, నంది పంప్‌హౌజ్‌కు 9,500 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.