
శిశువు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన గర్భిణి సువర్ణకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త కరణ్ బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలీవరీ చేస్తామని చెప్పి చేర్చుకున్నారు. అదే రోజురాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. మంచిర్యాలకు రెఫర్ చేయకుండా వైద్యులు అశ్రద్ధ చేసి తమ బిడ్డ మృతి చెందడానికి కారకులయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా మగశిశువు స్టిల్‌బర్త్‌తో పుట్టాడని, తల్లిగర్భంలో ఉన్నప్పుడు మలం తినడంతో మృతి చెందినట్లు తెలిపారు.