
ఉద్యోగాల పేరిట మోసగించిన నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: ఎస్‌కే మైక్రోఫైనాన్స్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలంలోని శంకర్‌గూడకు చెందిన జవాడే కృష్ణ అలియాస్ జాదవ్ కృష్ణ ఎన్‌ఆర్‌ఐ అంటూ సామాజిక సేవ పేరుతో పరిచయాలు పెంచుకొని మైక్రో ఫైనాన్స్, ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్‌వాడీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. 2024 డిసెంబర్‌లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్‌లో మైక్రో ఫైనాన్స్ పేరుతో కార్యాలయాలను ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా 300 మంది నుంచి రూ.20 వేల చొప్పున మెంబర్‌షిప్ చేయించాడు. రెండు కార్యాలయాల్లో ఐదుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నిరుద్యోగుల నుంచి రూ.69 లక్షలు వసూలు చేశాడు. ఆరునెలల పాటు కనిపించకపోవడంతో జూలైలో నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శంకర్‌గూడలో రూ.9 లక్షల నగదు, రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇంట్లోనే దాచిపెట్టి రూ.15 లక్షలతో పరారయ్యాడు. నిందితుడిని భోరజ్ చెక్‌పోస్టు వద్ద అరెస్ట్ చేసి రూ.9లక్షల నగదుతో పాటు 10.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఐదు సెల్ ఫోన్లు, ఒక ఖరీదైన వాచ్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి విడతల వారీగా వసూలు చేసి మోసం చేసిన డబ్బుల్లో రూ.6లక్షలు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ యజమానికి ఇచ్చాడని, మరో రూ.6లక్షలు మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భవన యజమానికి, రూ.3.5 లక్షలు ఆదిలాబాద్, ఉట్నూర్ కార్యాలయాల నిర్వహణకు, రూ.2.1 లక్షలు నిందితుడి తమ్ముడి అవసరాల నిమిత్తం ఇచ్చినట్లు తెలిపారు. మిగితా డబ్బులు జల్సాల కోసం, తప్పించుకోవడానికి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిందితుడు కరోన సమయంలో ముంబాయ్‌లో ఫేక్ రెమిడి ఇంజక్షన్లను విక్రయించాడని, నాగ్‌పూర్‌లో రుణాల పేరిట అక్కడి ప్రజలను మోసం చేశాడని తెలిపారు. నిందితుడిపై ఉట్నూర్‌లో 3, ఇంద్రవెల్లిలో 3, నార్నూర్‌లో 2, మావల పోలీసు స్టేషన్‌లో 3, ఆదిలాబాద్ వన్‌టౌన్‌లో 2, జైనథ్‌లో 3 చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ ఎం.ప్రసాద్, ఐటీకోర్ ఎస్సై గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్