
● ఆర్టీసీకి కలిసి వచ్చిన వరుస సెలవులు ● ‘పౌర్ణమి’ రోజున
మంచిర్యాలఅర్బన్/ఆదిలాబాద్: వరుస సెలవులు, పండుగలు ప్రజా రవాణా సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీపౌర్ణమి, 10న ఆదివారం కలిసి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 7నుంచి 11వరకు రీజియన్ వ్యాప్తంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 101 నమోదవడం రద్దీ తీరుకు నిదర్శనం. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఆరు డిపోల పరిధిలో ఐదు రోజుల వ్యవధిలో ప్రతీ కిలోమీటర్‌కు రూ.66.48 ఆదాయం వచ్చింది. మొత్తం 639 బస్సులు 13,93,000 కిలోమీటర్లు తిరిగి 18.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జూలై నెలలో ఒక్క సాధారణ రోజు ఇన్‌కమ్ రూ.1.85 కోట్లుగా ఉంది. అయితే రాఖీ పండుగ ఒక్కరోజే రీజియన్ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. గతేడాది ఈ పండుగకు రూ.1.57 కోట్ల ఆదాయం రాగా ఈ సారి అదనంగా మరో రూ.1.32 కోట్లను ఆర్జించి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఐదు రోజుల్లో రీజియన్ పరిధిలో రూ.9.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా నిర్మల్ డిపో రూ. 2.49 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
‘మహాలక్ష్మి’లే అధికం..
తమ సోదరులకు రాఖీ కట్టేందుకు దూర ప్రయాణమైనా మహిళలు ఆర్టీసీలో ప్రయాణించడం సంస్థకు లాభించింది. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం 18.84 లక్షల మంది ప్రయాణించగా, అందులో 12.60 లక్షల మంది ‘మహాలక్ష్మి’లే ఉన్నారు. అత్యధికంగా పౌర్ణమి రోజున 4.27 లక్షల మంది ప్రయాణించగా, ఇందులో 2.93 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులున్నారు. ఇక ఆక్యూపెన్సీ రేషియో విషయానికి వస్తే ఉట్నూరు డిపో పరిధిలో అత్యధికంగా 109 ఉండగా, నిర్మల్ 106, భైంసా 102, ఆదిలాబాద్ 101, మంచిర్యాల 97, ఆసిఫాబాద్ 95గా నమోదయ్యాయి.
ముందస్తు ప్రణాళికతో..
వరుసగా రెండు పండుగలు, ఆదివారం కూడా తోడవడంతో రద్దీని ముందే పసిగట్టిన ఆర్టీసీ అధి కారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగా రు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలతోపాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తదనుగుణంగా యాజమాన్యం ప్రత్యేక బస్సులు నడిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు 118 స్పెషల్ సర్వీస్‌లను ఏర్పాటు చేశారు. రద్దీకి అ నుగుణంగా 7, 8వ తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉ మ్మడి ఆదిలాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు 46 బ స్సులు ఏర్పాటు చేయగా, 10 నుంచి 12వ తేదీ వర కు రీజియన్ నుంచి హైదరాబాద్‌కు 72 బస్సులను ఆపరేట్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోనికి తీసుకొని ఈసారి వారికి ప్రత్యేక భోజన వసతి కల్పించారు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతోపాటు ఆర్టీసీకి ఆమ్దాని వచ్చింది.
రీజియన్ పరిధిలో ఇలా..
(ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు)
అగ్రస్థానంలో నిర్మల్ డిపో..
ఐదు రోజుల్లో నిర్మల్ డిపో రూ.2.49 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రూ.1.25 కోట్లతో సరిపెట్టుకోగా, ఈసారి రెట్టింపు సమకూర్చుకో వడం విశేషం. గతంలో రూ.కోటి 80 వేల ఆదాయంతో నిలిచిన ఆది లాబాద్ ఈసారి పుంజుకుని రూ.2.15 కోట్లకు చేరుకుంది.
డిపో బస్సులు ప్రయాణించిన ఆదాయం
కి.మీ(లక్షల్లో) (రూ.కోట్లలో)
ఆదిలాబాద్ 3.22 2.15
భైంసా 1.47 0.90
నిర్మల్ 3.47 2.49
ఉట్నూర్ 0.77 0.53
ఆసిఫాబాద్ 1.69 1.06
మంచిర్యాల 3.31 2.13
రీజియన్ 13.93 9.26
సమష్టి కృషి
ఆర్టీసీ ప్రతీ ఉద్యోగి సమష్టి కృషితోనే మంచిర్యాల డిపోకు ఆదాయం సమకూరింది. పండుగవేళ కూడా ప్రతి ఒక్కరూ విధిగా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వర్తించారు. మహిళా ఉద్యోగులూ రాఖీ రోజున డ్యూటీలు చేయాల్సి వచ్చింది. వీరందరి కృషితోనే ఐదు రోజుల్లో రూ.2,12,73,888 ఆదాయం ఆర్జించాం. ఆదాయం రావడానికి కృషి చేసిన ప్రతీ ఉద్యోగికి ఈ నెల 13న స్వీట్లు పంపిణీ చేస్తాం.
–శ్రీనివాసులు, డీఎం, మంచిర్యాల