లక్ష్య సాధనపై సింగరేణి దృష్టి | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనపై సింగరేణి దృష్టి

Aug 13 2025 5:26 AM | Updated on Aug 13 2025 5:26 AM

లక్ష్య సాధనపై సింగరేణి దృష్టి

లక్ష్య సాధనపై సింగరేణి దృష్టి

● సంస్థ స్థితిగతులపై ఉద్యోగులకు అవగాహన ● ఉత్పత్తి పెంపునకు చర్యలు ● మల్టీడిపార్టుమెంటల్‌ సమావేశాలు

శ్రీరాంపూర్‌: సింగరేణిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పని సంస్కృతిని మెరుగుపర్చేందుకు యాజమాన్యం దృష్టి సారించింది. బొగ్గు మార్కెట్‌లో పోటీ నెలకొనడం, గనులన్నీ పాతవి కావడం, సంప్రదాయ పని విధానం, కొత్తగనులు రాకపోవడం, యంత్రాల వినియోగం తగ్గడం వెరసి సంస్థ సవాళ్లు ఎదుర్కోంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీని గట్టెక్కించి ఉజ్వల భవిష్యత్‌కు పునాది వేయడం కోసం అధికారులు సంస్థ స్థితిగతులపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. వనరుల సద్వినియోగం వల్ల సంస్థ లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇందుకోసం ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్‌ల్లో మల్టీడిపార్టుమెంటల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 18వరకు కొనసాగుతాయి. భూగర్భగనులు, ఓసీపీలు, డిపార్టుమెంట్లపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, లాభనష్టాలు, యంత్రాల పనితీరు, బొగ్గు నాణ్యత, గత సంవత్సరం సాధించిన ఉత్పత్తి ఉత్పాదకత ఎలా ఉంది, భూగర్భగనుల్లో వస్తున్న నష్టాలు, ఓసీపీలో వస్తున్న లాభాలతో సమం చేస్తుండడంపై కంపెనీ, ఏరియా స్థాయితోపాటు గనులవారీగా గణాంకాలు తీసి వివరిస్తున్నారు. నష్టాలు తగ్గించడానికి ఏం చేయాలి, ఏ చర్యలు తీసుకుంటే ఉత్పత్తి పెరుగుతుందో తెలియజేస్తున్నారు.

సద్వినియోగంతోనే ఉపయోగం

బొగ్గు ఉత్పత్తిలో భూగర్భ గనుల్లో ఎస్‌డీఎల్‌ యంత్రాల వినియోగం పెంచాలని సూచిస్తున్నారు. ఒక ఎస్‌డీఎల్‌ యంత్రం రోజు 133 టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 100 టన్నుల వరకే సాధిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. వంద శాతం ఉత్పత్తి సాధిస్తే ఉత్పత్తి పెరిగి నష్టం తగ్గుతుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే రూ.9,468 ఖర్చవుతుంది. దీన్ని విక్రయిస్తే రూ.4864 వస్తుంది. ఈ లెక్కన టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే కంపెనీకి రూ.4602 నష్టం వస్తున్నట్లు లెక్కలేసి చెబుతున్నారు. డ్రిల్‌మిషన్ల పనితీరు, ప్రస్తుతం పనిగంటలు, లక్ష్యం ఎంత వివరిస్తున్నారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే షవల్స్‌ పనితీరు మెరుగుపర్చాలని, డంపర్లు 18 గంటల పని చేయాలని, బొగ్గు నాణ్యత పాటించకపోవడం వల్ల రూ.కోట్లు ఫెనాల్టీ చెల్లించాల్సి రావడం అంశాలు తెలియజేస్తున్నారు.

స్పేర్స్‌ కొరత.. నాసిరకం పరికరాలు

అధికారులు ఎంత చెప్పినా కంపెనీ పరంగా చర్యలు తీసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని కార్మికులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల్లో చాలా వరకు ఎస్‌డీఎల్‌ యంత్రాలు సర్వే ఆఫ్‌ అయినవే ఉన్నాయి. వాటితోనే పని చేస్తున్నారు. దీనికి తోడు స్పేర్స్‌ కొరత తీవ్రంగా ఉంది. స్పేర్స్‌ సమయానికి బ్రేక్‌డౌన్ల వల్ల నష్టం జరుగుతోంది. మరికొన్ని సందర్భాల్లో నాసిరకం ఆయిల్స్‌, విడిభాగాలు లేకపోవడం వల్ల యంత్రాలు మొరాయించి ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని కొందరు అధికారులే పేర్కొంటున్నారు. ఓసీపీల్లో కాంట్రాక్టర్లు ఓబీ లక్ష్యాలను తీయకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అనుభవం, సామర్థ్యం లేని సంస్థలకు ఓబీ పనులు అప్పగించడం, టెండర్లలో విధానపర లోపాలు, ఓబీ వెలికితీతకు సరిపడా యంత్రాలను సమకూర్చుకోకపోవడం వెరసి సంస్థ ఉత్పత్తి లక్ష్యాలపై ప్రభావం చూపుతుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యాలు పెరగడం, యూనియన్‌ నేతలు, కార్యకర్తలు కొందరు పూర్తి స్థాయిలో గనుల్లోకి దిగి పనిచేయకుండా ఉచిత మస్టర్లు పొంది సంస్థకు నష్టం చేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ వ్యవస్థాగత లోపాలను సరిచేయాల్సిన బాధ్యత కూడా యాజమాన్యంపై ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement