● 40 ప్రశ్నలతో వివరాల సేకరణ
● జనవరి 10 నుంచి రెండో దశ ప్రక్రియ
● జిల్లా, డివిజన్, చార్జ్ అధికారులకు రెండు రోజుల శిక్షణ
జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): జనగణనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. జనగణన రెండో దశ నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, తహసీల్దార్లు, అదనపు ఛార్జ్ అధికారులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జనగణన రెండో దశ షెడ్యూల్, విధివిధానాలు, అధికారుల బాధ్యతలపై వివరించారు. 2027 జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణన, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యుమరేటర్ల ద్వారా గణన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28న రాత్రి ఇళ్లు లేని వారి గణన చేపట్టి, మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహిస్తారని వెల్లడించారు. జనగణనలో భాగంగా ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి 40 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రజలు సరైన సమాచారం అందించి గణన విజయవంతానికి సహకరించాలని కోరారు. స్వీయ గణన ప్రక్రియను గ్రామపంచాయతీల వారీగా సమర్థవంతంగా నిర్వహించేందుకు పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకోవాలని సూచించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ సర్వేను విజయవంతంగా నిర్వహించినట్లే రెండో దశ జనగణనను కూడా సమర్థవంతంగా పూర్తి చేయాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ మాట్లాడుతూ, మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. ఛార్జ్ అధికారులు, సిబ్బందికి ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని, స్వీయ గణనపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఈఓ విజయకుమారి, సీపీఓ నర్సింహులు, ట్రైనర్లు దయానంద్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


