● రూ.24 లక్షల నష్టం
రాజోళి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో 10 ఎకరాల్లో చెరుకు పంట దగ్ధమై రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడమరుసు గ్రామానికి చెందిన రైతు రాంప్రసాద్ తనకున్న 10 ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా పంటకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన చుట్టుపక్కల రైతులు గ్రామస్తులకు సమాచారం అందించి, అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. అయితే అప్పటికే పంటతోపాటు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.24 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే కాలిపోవడంతో రైతు కుటుంబం ఆవేదనకు గురైంది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతును ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


