డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: పోలీస్‌స్టేషన్ల పనితీరు, కేసుల పరిష్కారం, రికార్డుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం ఎసీ వార్షిక తని ఖీలు నిర్వహించారు. కార్యాలయ పరిధిలోని పలు రకాల కేసు ఫైల్స్‌, రికార్డులు, రిజిస్టర్లు, పెండింగ్‌ కేసులను తనిఖీ చేశారు. జిల్లాలో ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్స్‌తో పాటు సర్కిల్‌ కార్యాలయాల్లో రికార్డులు, రిజిస్టర్లు ఎప్పటికప్పుడు ఆప్‌డేట్‌ చేయడంతో పాటు ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించారు.వార్షిక తనిఖీల ద్వారా సదరు స్టేషన్లు, కార్యాలయాల పని తీరులో ఉండే లోపాలను గుర్తించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లుతో పాటు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

రీసర్వేతో

భూహక్కులకు భద్రత

హన్వాడ: భూ రీసర్వేతో రైతుల భూముల వివరాలు పక్కాగా నమోదవడంతో పాటు భూహక్కులకు భద్రత లభిస్తుందని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ అన్నారు. మండల పరిధిలోని దోరసముద్రంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, రైతుల పొలాల రీసర్వే పురోగతి, పనుల నిర్వహణ తీరుపై తహశీల్దార్‌ కిష్ట్యానాయక్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్వే బృందాలు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి రీసర్వేలో వినియోగిస్తున్న సాంకేతిక విధానాలను పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతోనూ సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. రీసర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు జీపీఎస్‌ రోవర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా ప్రతి రైతు భూమికి డిజిటల్‌ ల్యాండ్‌ పార్సెల్‌ మ్యాపులు రూపొందిస్తామని, భవిష్యత్తులో భూముల సరిహద్దుల వివాదాలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు తమకు కేటాయించిన సమయానికి పొలాల వద్దకు చేరుకుని, సాగు చేస్తున్న భూముల సరిహద్దులను ఖచ్చితంగా చూపించాలని సూచించారు. రీసర్వే పనులు వేగంగా, పారదర్శకంగా పూర్తయ్యేందుకు రైతులు, గ్రామస్తులు సర్వే బృందాలకు, రెవెన్యూ అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ కిష్ట్యానాయక్‌, ఆర్‌ఐలు సంజీవ, సల్మా, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సర్వేయర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

ఫ్యాకల్టీ పోస్టులకు

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలోని కేజీబీవీలు, తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఐఐటీ, నీట్‌, క్లాట్‌ కోచింగ్‌ బోధించేందుకు ఆసక్తి గల ఫ్యాకల్టీ దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌, రూరల్‌ కేజీబీవీలు, భూత్పూర్‌ కేజీబీవీ, వెన్నచేడ్‌ తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఈ పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. పోస్టులకు సంబంధించిన వివరాలు డీఈఓ కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గలవారు ఈనెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

15వ రోజుకు చేరిన

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్ష

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: తమ డిమాండ్ల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక టీటీడీ కల్యాణ మండపం ఎదుట శిబిరంలో మంగళవారం ‘ఖాళీ గిన్నెలతో చప్పట్లు’ కొట్టే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జాక్‌ జిల్లా అధ్యక్షుడు డా.సునీల్‌కుమార్‌, సభ్యులు డా.ప్రవీణ్‌, డా.రాజేష్‌, డా.ప్రీతి, డా.అభినయ్‌, ఏఎన్‌ఎంలు మంజుల, భారతి, మహేష్‌, బుచ్చిబాబు, యుగేందర్‌, వెంకటేష్‌, నవీన్‌, జ్యోతి, శివ, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement