లెక్కల్లో 98.. ప్రైవేట్‌లో ఇంకెందరో?
పాలమూరు: విషజ్వరాల విజృంభణ.. డెంగీ భయం.. పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగులు.. వెరసి పాలమూరు ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లాలో డెంగీ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో అక్టోబర్ 27వ తేదీ వరకు 98 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో 56 కేసులు మహబూబ్‌నగర్ నగర పరిధిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో నిర్వహిస్తున్న పరీక్షలు, పాజిటివ్ కేసుల వివరాలపై సమగ్ర సమాచారం లేకపోవడంతో అసలు బాధితుల సంఖ్యపై స్పష్టత కొరవడుతోంది. దీంతో వ్యాధి నియంత్రణ చర్యలు, కేసుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నగరంలోనే అధికం..
జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో వైరల్ ఫీవర్స్‌తో పాటు డెంగీ కేసులు వెలుగుచూస్తున్నాయి. షాషాబ్‌గుట్ట, మర్లు, బీకే రెడ్డి కాలనీ, రామయ్యబౌళి, ఏనుగొండ, శివశక్తినగర్ ప్రాంతాల్లో జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎదిర పీహెచ్‌సీ పరిధిలోని ఏనుగొండ, పాలకొండ తదితర ప్రాంతాల్లో 16 కేసులు నమోదు కాగా, పీపీయూ యూనిట్ పరిధిలో 22 కేసులు నమోదయ్యాయి. జడ్చర్ల పట్టణంలోని పలు కాలనీల్లోనూ విషజ్వరాల ప్రభావం కనిపిస్తోంది. గంగాపూర్ పీహెచ్‌సీ పరిధిలో ఏడు, మహ్మదాబాద్‌లో ఎనిమిది, హన్వాడలో ఐదు, మిడ్జిల్‌లో మూడు డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు సూచిస్తున్నాయి.
కిట్లు ఉన్నాయంటారు..
పరీక్షలు ఎక్కడ?
జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రుల్లోనూ డెంగీ నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పరీక్షలు అందుబాటులో లేవని, ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలోనే ప్రధానంగా పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ల్యాబ్‌లలో ఒక్కో పరీక్షకు రూ.800 నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతోందని సమాచారం. జ్వరంతో ఆస్పత్రులకు వెళ్లే వారికి పలు రకాల పరీక్షలు సూచిస్తుండటంతో ఆర్థిక భారం పెరుగుతోంది.
ప్రైవేట్ కేసుల లెక్కలేవీ?
ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైన కేసుల వివరాలే ప్రధానంగా అధికారిక గణాంకాల్లో కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుంటున్న వారి వివరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కేసుల వాస్తవ పరిస్థితిపై స్పష్టత ఉండటం లేదు. ప్రైవేట్ వైద్య సంస్థలు పరీక్షల ఫలితాలు, పాజిటివ్ కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖకు క్రమం తప్పకుండా అందిస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అధికారిక సమాచారం లేకుండా ప్రైవేట్ రంగంలోనూ పెద్ద సంఖ్యలో డెంగీ కేసులు ఉన్నాయని నిర్ధారించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల నుంచి కేసుల వివరాలను సేకరించి సమగ్ర గణాంకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
మహబూబ్‌నగర్ నగరంలోనే 56 పాజిటివ్ కేసులు
షాషాబ్‌గుట్ట సహా పలు కాలనీల్లో విషజ్వరాల విజృంభణ
ప్రైవేట్ ఆస్పత్రుల కేసుల వివరాలపై కొరవడిన స్పష్టత
ప్రభుత్వాస్పత్రుల్లో పరీక్షలపై బాధితుల ఇబ్బందులు


