అచ్చంపేట: ఉమ్మడి పాలమూరు జాతీయ రహదారుల అభివృద్ధి సర్వేలకే పరిమితమైంది. రోడ్ల నిర్వహణ సైతం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జాతీయ రహదారుల విభాగం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఇందులో భూత్పూర్– మన్ననూర్ ప్రధాన రోడ్డుకు దశాబ్దకాలంగా జాతీయ రహదారి గుర్తింపు లభించడం లేదు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న నాగర్‌కర్నూల్ జిల్లాకు ఈ రోడ్డు మార్గం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వాహనదారుల ఇక్కట్లు చూడలేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. దీనికి జాతీయ రహదారుల విభాగం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలత వ్యక్తం చేసినా ముందడుగు మాత్రం పడలేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు దృష్టి సారించకపోవడంతో ఈ రోడ్డు మార్గానికి అనుమతులు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి.
2017 కేంద్ర బడ్జెట్‌లో..
భూత్పూర్– నాగర్‌కర్నూల్– మన్ననూర్ రోడ్డును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్‌లో 88 కి.మీ., ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించింది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల– వనపర్తి– పెబ్బేరు 74 కి.మీ., ఎర్రవల్లి– గద్వాల– రాయచూరు 55 కి.మీ., ప్రధాన రోడ్లను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పటి ప్రభుత్వం కోరగా.. కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన ఈ రోడ్లు అప్పట్లో సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ రోడ్లతో గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట కొత్త జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు మార్గం సుగమమవుతుంది.
మారిన ప్రతిపాదనలతో..
మొదట ప్రతిపాదించిన భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కాలక్రమేణా మద్దిమడుగు– గంగులకుంట (తెలంగాణ) మీదుగా సిరిగిరిపాడు (ఆంధ్రప్రదేశ్) వరకు 166 కి.మీ., రోడ్డుగా మారింది. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఇదంతా జరగడానికి ఆలస్యమవుతుండంతో మాజీ ఎంపీ రాములు విడతల వారీగా జాతీయ రహదారి ఏర్పాటు కోసం మరోసారి మన్ననూర్ వరకు ప్రతిపాదనలు రూపొందించి జాతీయ రహదారుల విభాగం సెక్రెటరీ గిరిధర్‌కు పంపించగా పరిశీలించి దాదాపు ఆమోదం తెలిపారు. చివరి క్షణంలో దీని ప్రతిపాదనలను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీ వరకు పొడిగించడంతో మారిన ప్రతిపాదనలతో ఆమోదం లభించలేదు. 2022లో కల్వకుర్తి– నంద్యాల కొత్త జాతీయ రహదారి–167కె మంజూరు తర్వాత కేంద్రం ఇప్పటి వరకు మరో జాతీయ రహదారి మంజూరు చేయలేదు. దీంతో ప్రాధాన్యత క్రమంలో ఉన్న కొత్త రోడ్డు మార్గాలు మరుగున పడుతున్నాయి.
భూత్పూర్– చించోలి రహదారితో..
బెంగళూరు– ముంబాయి మధ్య అనుసంధానంగా కొనసాగుతున్న భూత్పూర్– చించోలి జాతీయ రహదారి విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారి అనుసంధానంగా 88 కి.మీ., దూరంలో ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి–765కే వరకు పొడిగించడం వల్ల ముంబాయి, బెంగళూరు, శ్రీశైలం మూడు జాతీయ రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. వీటితోపాటు హైదరాబాద్– పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మహబూబ్‌నగర్– గుడేబల్లూరు జాతీయ రహదారి–167ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 80.01 కి.మీ., పనులకు రూ.3,175 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని దేవరకద్ర, మరికల్, మాగనూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల మధ్య రాకపోకల ఇబ్బందులు తీరుతాయి.
ఉమ్మడి జిల్లాకు దక్కని జాతీయ రహదారులు
ప్రతిపాదనలకే పరిమితమైన భూత్పూర్– మన్ననూర్ రోడ్డు
చించోలి రోడ్డుకు లింకుతో నాలుగు హైవేల అనుసంధానం
పాలమూరు ప్రజలకు తప్పని రవాణా కష్టాలు
ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని వేడుకోలు


