జడ్చర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్‌కు సేకరించిన భూము లు, పరిహారం పంపిణీ తదితర వివరాల రికార్డులు మాయమయ్యాయి. భూ సేకరణ సమయంలో విధులు నిర్వర్తించిన అధికారులు బదిలీ అయినప్పుడు రికార్డులు అప్పగించకుండా తమ వెంటే తీసుకెళ్లారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే భూ రికార్డులపై విచారించిన అధికారులు సైతం కార్యాలయంలో ఆయా రికార్డులు లేవని చెప్పడం ఇందుకు బలం చేకూరుస్తుంది. అయితే రికార్డుల మాయం వెనక మర్మం ఏమిటి.. తమ అక్రమాలు బహిర్గతం కాకూడదనే ఉద్దేశమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
5.20 ఎకరాలు అదనంగా చూపి..
ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న ఉదండాపూర్, వల్లూరు గ్రామాలతోపాటు తుమ్మలకుంటతండా, రాగడిపట్టతండా, చిన్నగుట్టతండా, ఒంటిగుడిసె తండాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందుకు సంబంధించి నిర్వాసితులకు పునరావాసం కోసం పోలేపల్లి గ్రామ శివారులో 316 ఎకరాల భూమి కేటాయించారు. అయితే సర్వే నం.554లో 79.39 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి.. దీనిని పునరావాసానికి కేటాయించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ భూమిని అనుభవిస్తున్న రైతులకు ఎకరాకు రూ.12 లక్షలు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే ఈ భూమిని సాగు చేసుకుంటున్న నిజమైన రైతులను గుర్తించి పరిహారం అందించే ప్రక్రియలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు తెరలేపారు. మొత్తం 79.39 ఎకరాలలో అప్పటికే ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌కు 9.39 ఎకరాలు, రెసిడెన్సియల్ స్కూల్‌కు 2.20 ఎకరాలు, అష్టలక్ష్మి దేవాలయానికి 3 ఎకరాలు పోగా.. మిగిలిన 64.20 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ 64.20 ఎకరాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా 70 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే 5.20 ఎకరాలను అదనంగా పేర్కొని ఆ పరిహారాన్ని బినామీల పేరుతో రూ.66 లక్షలు స్వాహా చేశారు. అంతేగాక ధరణి రికార్డులలో ఉన్న పలువురు అర్హులైన రైతులను కాకుండా.. బినామీల పేర్లను నోటిఫికేషన్‌లో చేర్చడం గమనార్హం. కేటగిరి–1లో ఆర్‌ఓఆర్, గ్రామ రికార్డులు, ధరణిలో పేర్లు ఉన్న వారికి 23 ఎకరాలకు గాను రూ.276 లక్షలు పరిహారంగా చెల్లించారు. కేటగిరీ–2లో పూర్తి విచారణ లేకుండానే 11 ఎకరాలకు సంబంధించి రూ.132 లక్షలు చెల్లించారు. అలాగే కేటగిరీ–3లో మాజీ తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణల ఆధారంగా 31.28 ఎకరాలకు రూ.380.40 లక్షలు చెల్లించినా.. ఇందుకు సంబంధించిన ఫైళ్లు ఇతరత్రా వాటిని ధ్రువీకరించలేదు.
యాప్‌తోనే ఎరువులు
రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందించేందుకు కేంద్రం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
–8లో u
కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు
పోలేపల్లి శివారులోని సర్వే నం.554లోని భూమిని గత కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న తమకు కాకుండా అనర్హులకు పరిహారం ఇచ్చారని అప్పట్లో కొందరు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై 2022లో విచారణ చేసిన ఆర్డీఓ తహసీల్దార్, గిర్దావర్‌లు విధులను సక్రమంగా నిర్వర్తించలేదని, అలాగే సంబంధిత రికార్డులను స్వాధీనం చేయకపోవడాన్ని గుర్తించి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. దీంతో సంబంధిత తహసీల్దార్, గిర్దావర్లకు నాలుగు సార్లు మెమోలు జారీచేసినా స్పందించకపోవడంతో అప్పటి కలెక్టర్ విజయేందిర క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఏకు సిఫార్సు చేశారు. అయితే సీసీఐ అధికారులు మాత్రం కేవలం ఇంక్రిమెంట్లను నిలిపివేసి చర్యలను మమ అనిపించినట్లు సమాచారం.


