పాలమూరు: ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రుల్లోనే భద్రతా ప్రమాణాలు గాలికొదిలేస్తున్న పరిస్థితి వెలుగుచూసింది. నగరంలోని ఆరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా పలు లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఏ ఒక్క ఆస్పత్రికీ ఫైర్ సేఫ్టీ అనుమతి (ఎన్‌ఓసీ) లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు, నర్సింగ్, టెక్నికల్ సిబ్బంది అర్హత ధ్రువపత్రాలు, ల్యాబ్ అనుమతులు, ధరల పట్టికలు, పొల్యూషన్, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణకు సంబంధించిన పత్రాలు సక్రమంగా లేవని అధికారులు గుర్తించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సాన్వి సూపర్ స్పెషాలిటీ, అభయప్రద, మారుతీ సూపర్ స్పెషాలిటీ, వెన్నెల, ఆరోగ్య ఆస్పత్రులతో పాటు పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. ఆయా ఆస్పత్రుల్లో రికార్డులు, అనుమతులు, సిబ్బంది అర్హతలు, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.
● సాన్వి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ లేకపోవడంతో పాటు టెక్నికల్, నర్సింగ్ సిబ్బంది ధ్రువపత్రాలు అందుబాటులో లేవని గుర్తించారు. రోగులకు కనిపించే విధంగా ధరల పట్టికను ఏర్పాటు చేయలేదని అధికారులు పేర్కొన్నారు.
● మారుతీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రసవాలు, రోజువారీ ఓపీతో పాటు వైద్యులు, సిబ్బందికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అక్కడ కూడా సిబ్బంది అర్హతకు సంబంధించిన సరైన పత్రాలు లేవని గుర్తించారు.
● వెన్నెల ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీతో పాటు ఫైర్ ఆడిట్ కూడా లేదని గుర్తించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వినియోగించే అగ్నిమాపక యంత్రాల్లో కొన్ని కాలం చెల్లినవిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
● పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రితో పాటు అదే భవంనలో ఉన్న ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్‌ను పరిశీలించారు. క్యాన్సర్ ఆస్పత్రిలో ధరల పట్టిక వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్లడ్‌బ్యాంక్ నిర్వహణ ఎలాంటి లోపాలు లేకుండా సరిగా చేపట్టాలని సూచించారు.
నిబంధనలు పాటించాల్సిందే
నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొదటి విడతగా ఆరు ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్, టెక్నికల్, ఇతర సిబ్బంది అర్హత ధ్రువపత్రాలు, సేవల ధరల పట్టిక, ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ, పొల్యూషన్, బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆస్పత్రులు పారదర్శకంగా వ్యవహరిస్తూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రుల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నగరంలో ఆరు ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ బృందం తనిఖీలు
ఫైర్ సేఫ్టీతో పాటు వైద్య, టెక్నికల్, నర్సింగ్ సిబ్బంది ధ్రువపత్రాలు నిల్
ధరల పట్టికలు లేకుండానే వైద్యసేవలు.. రోగులకు సమాచారం కరువు
15 రోజుల్లో అనుమతులు పొందాలి: డీఎంహెచ్‌ఓ


