మహబూబ్‌నగర్ క్రైం: ప్రతి కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదట పెండింగ్‌లో ఉన్న దొంగతనం కేసులు, ఎన్‌బీడబ్ల్యూ, సైబర్ నేరాలు, ఎన్‌డీపీఎస్ యాక్ట్, సీసీటీఎన్‌ఎస్ కేసులపై సమగ్రంగా సమీక్షించారు. నిందితుల అరెస్టులు, కోర్టు కేసుల పరిష్కారంపై స్టేషన్ వారీగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి, నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ కేసులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరికుమార్, సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, గాంధీనాయక్, రామకృష్ణ, నాగార్జునగౌడ్, రవిబాబు, ఎస్‌ఐలు రాఘవేందర్, రవి పాల్గొన్నారు.
గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ఇంటర్వ్యూలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఇంజినీరింగ్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి అధికారులు డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో వీసీ శ్రీనివాస్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ క్రాంతికిరణ్, సభ్యులు గోవర్ధన్‌రెడ్డి, నిరంజన్‌గౌడ్, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పాల్గొన్నారు.
● పీయూ బాలుర హాస్టల్‌ను రిజిస్ట్రార్ రమేష్‌బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. వార్డెన్లు కృష్ణయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి వాలీబాల్
అకాడమీ పునఃప్రారంభం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా వాలీబాల్ అకాడమీని ఈనెల 13 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులందరూ యథావిధిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కోచ్‌లు, వార్డెన్‌తో పాటు సిబ్బంది అందరూ విధుల్లో చేరాలని సూచించారు.


