మున్సిపాలిటీలో ఫారాలు నింపేందుకు ప్రత్యేక కౌంటర్లు
● డిగ్రీ విద్యార్థులను వలంటీర్లుగా ఎంపిక చేసిన అధికారులు
● ప్రజలకు ఫారాలు నింపడంలో సహకారం
కల్వకుర్తి టౌన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కల్వకుర్తి మున్సిపాలిటీ వినూత్న చర్యలు చేపట్టింది. ఓటర్లు సర్ ఫారాలను సులభంగా నింపి సమర్పించేలా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులను వాలంటీర్లుగా నియమించింది. దీంతో ప్రజలకు ఫారాలు నింపడంలో ఎదురవుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతున్నాయి.
ప్రత్యేక సహాయ కేంద్రాలు..
మున్సిపల్‌లోని అన్ని వార్డులలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద వాలంటీర్లు అందుబాటులో ఉంటూ ఓటర్లకు అవసరమైన సాయమం దిస్తున్నా రు.సర్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ పత్రాలు జత చేయాలి.. ఏ వివరాలు నమోదు చేయాలి వంటి అంశాలను ఓటర్లకు వివరంగా తెలియజేస్తున్నారు.
డిగ్రీ విద్యార్థుల సేవలు..
పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలకు చెందిన ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు వారికి ముందస్తు శిక్షణ ఇచ్చి ఫారాల పరిశీలన, వివరాల నమోదు, అవసరమైన ధ్రువపత్రాల పరిశీలన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ సర్ ప్రక్రియ వేగవంతం కావడానికి సహకరిస్తున్నారు.
వృద్ధులకు, మహిళలకు ఊరట..
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు ఫారాలు నింపడంలో ఇబ్బందులు పడకుండా వాలంటీర్లు ప్రత్యక్షంగా సాయం చేస్తున్నారు. ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి పొరపాట్లు లేకుండా పూర్తి చేయడంలో మార్గనిర్దేశం చేస్తున్నారు. అవసరమైన పత్రాలు లేకుంటే వాటిని ఎలా సమర్పించాలనే విషయాన్ని కూడా వివరిస్తున్నారు.
వేగవంతమైన ప్రక్రియ..
వాలంటీర్ల సేవలతో సర్ ఫారాల సమర్పణ మరింత వేగంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రజలు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫారాలు సమర్పించాలని, అవసరమైతే మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన వాలంటీర్ల సాయాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం, విద్యార్థుల సేవాభావంతో సర్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని అధికారులు వివరిస్తున్నారు.


