మహబూబ్‌నగర్ న్యూటౌన్: హమాలీ, రైస్‌మిల్ వర్కర్స్‌కు ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం కోసం పోరాటం చేయాలని తెలంగాణ ప్రగతిశీల హమాలీ, రైస్‌మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. ఈ నెల 27న జిల్లాకేంద్రంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం బోయపల్లి రోడ్ గణేష్ రైస్ ఇండస్ట్రీ వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న హమాలీ, రైస్ మిల్ కార్మికులు 3 లక్షలపైనే ఉన్నారన్నారు. కానీ, కార్మికులకు రక్షణ లేదని, ఎగుమతి దిగుమతి, గ్రైండింగ్, మోత, నెట్టు కట్టడం, కుట్టు లోడింగ్, అన్ లోడింగ్, సరుకు రవాణ వంటి పనులు నిర్వహించే హమాలీల బతుకులు దీనస్థితిలో ఉన్నాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు హమాలీ– రైస్‌మిల్లు కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి.. 57 ఏళ్లు దాటిన వారికి రూ.9 వేల పింఛన్ ఇవ్వాలని, ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం గురైన వారికి రూ.10 లక్షలు నష్టపరిహారం, సాధారణ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవుతో కూడి ఉన్న సౌకర్యం కల్పించాలని, ఇల్లు లేని వారికి స్థలం కేటాయించి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధన కోసం హమాలీ, రైస్ మిల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు దాసు, ముకేశ్, ప్రమోద్, శ్రీను, కుర్మయ్య, నవాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ కూలీ మృతి
జడ్చర్ల: చుట్టపు చూపుగా వచ్చి వ్యక్తిపై కొందరు గ్రామస్తులు అకారణంగా దాడి చేయగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు..హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన నద్దునూరి నాగరాజు(54) కూలీ పని చేసేవాడు. ఈనెల 16వ తేదీన మండలంలోని గొల్లపల్లిలో చెల్లెలు ఎడ్ల లక్ష్మి ఇంటికి వచ్చాడు. ఆరోజు గ్రామంలో బయటకు వెళ్లినప్పుడు కళ్లు తిరిగి రవళి ఇంటి వద్ద కూర్చోగా.. అతనిపై గ్రామానికి చెందిన బాలయ్య, రాజు దాడిచేసి నల్లాపైపుతో కొట్టారు. దాడి తరువాత చెల్లెలు ఇంటికి వెళ్లగా.. రవళి కూడా వచ్చి దాడి చేసింది. దీంతో మరుసటి రోజు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. గ్రామస్తుల దాడిలో తగిలిన దెబ్బలతో చనిపోయాడా మరే ఇతర కారణాలతో చనిపోయాడా అనే కోణంలో విచారించి చర్యలు తీసుకోవాలని మృతుడి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


