ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం

Jul 21 2026 1:36 AM | Updated on Jul 21 2026 1:36 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా తెలంగాణకు నాంది కావాలని.. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం మిషన్‌ మోడ్‌లో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ, ఇతర అభివృద్ధి కార్యకలాపాలపై సోమవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసంపూర్తి సమాచారంతో హాజరైన వ్యవసాయ, మిషన్‌ భగీరథ, ఉపాధిహామీ, విద్యుత్‌శాఖ అధికారులపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలో నిర్వహించే సమీక్షకు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని ప్రజలపై పడనీయొద్దన్నారు. తాగు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌, పశుసంవర్ధకం సహా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 31 నాటికి శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం శాఖల వారీగా ప్రస్తుత పరిస్థితులను, భవిష్యత్‌ కార్యాచరణను అధికారులు మంత్రికి వివరించారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నాయని.. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నిండిన తర్వాతే దిగువకు నీటి ప్రవాహం వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత సమర్థంగా వినియోగిస్తూ తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. భూగర్భ జలమట్టం తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు, అత్యవసర వైద్య సామగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ నెల 24న ఉదయం 10గంటలకు నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌లో నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల అధికారులతో, మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించి.. జిల్లాల వారీగా కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.

● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 50శాతం మేర మాత్రమే పంటలు సాగుచేశారన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే సాగు చేసిన పంటలను శాసీ్త్రయ పద్ధతుల్లో సంరక్షిస్తూ, తేమను నిల్వ చేసుకునే విధానాలు, పంటల రక్షణ చర్యలను పాటించాలన్నారు.

●అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలోని చెంచు గిరిజనులు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి ఉందన్నారు. మాచారంలో సీఎం ఇందిరా సౌరగిరి జలవికాసం కార్యక్రమం ద్వారా మధ్యంతర పంటల సాగును ప్రారంభించడం గిరిజన రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు.

● నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ నీటితో లాభదాయక పంటల సాగుపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

● కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎంజీకేఎల్‌ఐ కాల్వల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రైతుల పొలాల్లోకి నీరు చేరి నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం వర్షాభావం నేపథ్యంలో సాగునీటి కాల్వల పెండింగ్‌ పనులను పూర్తిచేయాలన్నారు.

● దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. భూత్పూర్‌ మండలంలోని షేరుపల్లిలో విజయవంతంగా సాగుచేస్తున్న కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల నమూనాలను ఇతర రైతులకు చూపించి ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

● జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్ల మున్సిపాలిటీలో మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాలో తీవ్ర సమస్యలు నెలకొన్నాయన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు.

● గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లా డుతూ.. జిల్లా జనరల్‌ ఆస్పత్రితో పాటు పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ఎక్కువ మంది రోగు లను కర్నూలు జిల్లాకు రెఫర్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అనంతరం జలసిరి, వ్యవసా య ప్రణాళిక కరదీపికను ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్‌, విజయుడు, జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ షఫీ ఉల్లా, కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్‌ సురభి, సీహెచ్‌ ప్రియాంక, షేక్‌ రిజ్వాన్‌ భాషా, హేమంత కేశవ్‌ పాటిల్‌, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఓబెదుల్లా కొత్వాల్‌, శాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్‌ సరిత, మహబూబ్‌నగర్‌ నగర మేయర్‌ జి.మమత ఉన్నారు.

అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ

అధికారుల అసంపూర్తి సమాచారంపై ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement