అమ్రాబాద్: పెద్దపులి దాడిలో రెండు పాడి ఆవులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా తెలిసింది. మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రాత్లావత్ నరేష్, దౌల అటవీ పక్కనే ఉన్న వారి వ్యవసాయ పొలం ఆదివారం ఆవులతో అరక దున్నారు. అనంతరం ఆవులను పక్కనే ఉన్న చింతలసేల్ల అడవికి మేతకు తీసుకెళ్లగా.. తప్పిపోయాయి. రాత్రి వరకు చూసిన తిరిగి రాలేదు. సోమవారం ఉదయం చింతలసేల్ల ప్రాంతంలో వెతకగా నరేష్ ఆవు విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. చుట్టూ గమనించగా.. పెద్దపులి జాడలు ఉండటమే కాకుండా ఆవును సగ భాగం తిన్నట్లు ఉందన్నారు. మరో చోట దౌల ఆవు కూడా పెద్దపులి దాడిలో మృతి చెంది కనిపించింది. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో సోమవారం సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అయితే ఒక్కో ఆవు విలువ రూ.90 వేలు ఉంటుందని, తమకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


