Telangana Crime News: గదిలోని హీటర్‌లో లోపం.. అమెరికాలో వనపర్తి విద్యార్థి మృతి!
Sakshi News home page

గదిలోని హీటర్‌లో లోపం.. అమెరికాలో వనపర్తి విద్యార్థి మృతి!

Jan 15 2024 12:44 AM | Updated on Jan 15 2024 1:05 PM

- - Sakshi

దినేష్‌ (ఫైల్‌)

వనపర్తిటౌన్‌: అమ్మానాన్నలతో మాట్లాడుతూ అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన కొన్ని గంటలకే ఆ కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఒక్కగానొక్క కొడుకును ఉన్నతంగా చదివించేందుకు 15 రోజుల కిందట ఎంఎస్సీ చేసేందుకు అమెరికాకు పంపిన తల్లిదండ్రులకు పండుగ పూట విషాదం నింపింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు గట్టు దినేష్‌ (22) డిసెంబర్‌ 28న ఎంఎస్సీ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు.

రోజులానే ఆదివారం తల్లిదండ్రులతో మాట్లాడి, తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కొద్ది గంటలకే కన్న కొడుకు చనిపోయాడనే వార్త వినాల్సి వచ్చింది. కొడుకు బాగా చదువుకోవాలని అయ్యప్ప మాలవేసుకొని శబరిమలైకు బయలుదేరేందుకు సిద్ధమైన ఆ తండ్రి కుంగిపోయాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, పట్టణ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

కుమారుడి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ కుమారుడు నిద్రలోనే మరణించినట్లు అమెరికా పోలీసుల నుంచి సమాచారం అందిందని, రూంలోని హీటర్‌లో వాసనలేని విషవాయువు బహిర్గతం కావడంతోనే చనిపోయినట్లు తెలిసిందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement