TS Elections 2023: జడ్చర్ల.. సమస్యల అడ్డా!

- - Sakshi

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని సిగ్నల్‌గడ్డ

ఆర్‌యూబీ లేక నిలిచిన రాకపోకలు ట్రాఫిక్‌ సమస్యతో సతమతం

‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌లో పలు సమస్యలు వెలుగులోకి..

జడ్చర్ల: ఒకవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండి.. మరోవైపు 44, 167 నంబర్ల జాతీయ రహదారులకు కేంద్రంగా ఉన్న జడ్చర్ల నియోజకవర్గంలో అనేక సమస్యలు తిష్టవేశాయి. ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోవడంలేదు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే ఎమ్మెల్యేకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జడ్చర్ల సెగ్మెంట్‌లో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

పురపాలికకు సొంత భవనం కరువు..
జడ్చర్ల మున్సిపల్‌ కార్యాలయానికి సొంత భవనం కరువయ్యింది. బాదేపల్లిలో ఉన్న పాత భవనాన్ని కూల్చివేసి కావేరమ్మపేటలోని పాత గ్రామపంచాయతీ భవనానికి కార్యాలయాన్ని తరలించారు. దీంతో వివిధ పనుల నిమిత్తం బాదేపల్లి వాసులు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి రావాలంటే వ్యయప్రయాసలకు గురవుతున్నారు. రూ.3కోట్లతో మున్సిపల్‌ కార్యాలయ భవనానికి శ్రీకారం చుట్టినా పనుల్లో ప్రగతి కనిపించడంలేదు.

చెట్ల కిందే సమావేశాలు..
పట్టణ మహిళా సంఘాలకు సొంత భవనం లేదు. దీంతో బాదేపల్లి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలోని రావిచెట్టు కింద కూర్చుని సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. బాదేపల్లిలో దాదాపు 550 మహిళా సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘంలో 10మంది సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన మొత్తం 5,500మంది సభ్యులు పట్టణ మహిళా సంఘంలో కొనసాగుతున్నారు. వీరి తరఫున పట్టణ మహిళా సంఘంలో 60మంది మహిళలు ప్రతినిధులుగా కొనసాగుతున్నారు.

స్టేడియం అభివృద్ధి అంతంతే..
పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలకు అనుబంధంగా దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలోగల స్టేడియం అభివృద్ధికి నోచుకోలేదు. స్టేడియానికి దాదాపు రూ.కోటి నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగలేదు. దీంతో క్రీడాకారులు, వాకర్స్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రంవేళల్లో వాక్కింగ్‌ కోసం ప్రజలు పెద్దఎత్తున స్టేడియానికి వస్తుంటారు. సెలవు రోజుల్లో స్టేడియం మొత్తం కిటకిటలాడుతోంది.

నత్తనడకన ఆర్‌యూబీ పనులు..
జడ్చర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆర్‌యూబీ (రైల్వే అండర్‌బ్రిడ్జి) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ ఆర్‌యూబీ నిర్మించాలని రెండు దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఏడాది కిందట రైల్వేగేటును పూర్తిగా మూసివేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాతబజార్‌, బూరెడ్డిపల్లి, ఆలూరు గ్రామాలతో పాటు గిరిజన తండాలవారు సిగ్నల్‌గడ్డ మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

కలగా మారిన బైపాస్‌..
జడ్చర్ల పట్టణానికి బైపాస్‌ రోడ్డు లేకపోవడంతో పట్టణం నడిబొడ్డు మీదుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. రెండు జాతీయ రహదారులతో పాటు అంతర్‌రాష్ట్ర రహదారులు సైతం ఉండటంతో ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా బాలానగర్‌ మండలంలోని పెద్దరేవల్లి, బోడజానంపేట ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. సీసీరోడ్లు, డ్రెయినేజీలను పూర్తిస్థాయిలో నిర్మించాల్సి ఉంది.

సిగ్నల్‌గడ్డలో నరకయాతన..
జడ్చర్లకు గుండెకాయలాంటి సిగ్నల్‌గడ్డ ప్రాంతం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. మూడు రోడ్ల కూడలిగా ఉన్న సిగ్నల్‌గడ్డ ప్రమాదాలకు నిలయంగా మారింది. సింగిల్‌ రైల్వేబ్రిడ్జిపైనే రాకపోకలు సాగించాల్సి రావడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎంతో మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. ప్రజల ఆందోళనతో ఆరునెలల కిందట రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాగా.. మందకొడిగా సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అంబేద్కర్‌ చౌరస్తావైపు పాత రోడ్డుపైనే బీటీ వేసి కాస్త ఉపశమనం కలిగించారు.

సమస్యలు పరిష్కారం కావడంలేదు..
జడ్చర్ల పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావడంలేదు. సమస్యల పరిష్కారంపై పాలకులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. సొంత ప్రయోజనాలకు మాత్రమే పురపాలిక మండలి పరిమితమైంది. రోడ్లు, డ్రెయినేజీలు నిర్మాణంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. పట్టణ అభివృద్ధికి యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.


– అనిల్‌కుమార్‌, సామాజికవేత్త, జడ్చర్ల

బైపాస్‌రోడ్డు లేక ఇబ్బందులు..
పట్టణానికి బైపాస్‌ రోడ్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణానికి రెండు వైపులా జాతీయ రహదారులు ఉండటంతో వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది. అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాలు పట్టణం నడిబొడ్డు మీదుగానే వెళ్లాల్సి రావడంతో పట్టణవాసులకు ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది.


– సత్తయ్య, జడ్చర్ల

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top