భద్రతను బలోపేతం చేయాలి
రాజాపూర్: పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకే పరిమితి కాకుండా ముందస్తు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలని డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజాపూర్ శివారులోని పోలేపల్లి సెజ్‌లో గల ఎన్‌ఐఎంఐఎస్ యూనివర్సీటీలో ఏర్పాటు చేసిన ప్రమాదాల నుంచి నివారణ పాఠాలు అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇటీవల పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకొని అన్ని స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీల యాజమాన్యానికి సూచించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. కార్మికుల భవిష్యత్ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పరిశ్రమల భద్రతా నిపుణులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


