మంత్రి స్వగ్రామంలో వార్డు మెంబర్ రాజీనామా
చిన్నంబావి: మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దదగడలో వార్డుమెంబర్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కంచి జ్ఞానేశ్వరి వార్డు మెంబర్‌గా పోటీచేసి గెలుపొందింది. అయితే, సోమవారం పాలకవర్గం ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక రాజకీయ నాయకులు, గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు తనకు ఉపసర్పంచ్ పదవి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సాక్షాత్తు గ్రామంలో మంత్రి, ఆయన కుమారుడు చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, గ్రామంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైతం ఆమె బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు.
హామీల అమలులో
కాంగ్రెస్ విఫలం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ మహబూబ్‌నగర్ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్ మరియు తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి గాయాలు
మక్తల్: టిప్పర్, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన దాసర్‌దొడ్డి సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మాగనూర్ మండలం కొత్తపల్లికి చెందిన విశ్రాంత జవాన్ సంజీవ్ (35) పని నిమిత్తం బైక్‌పై మక్తల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా దాసరదొడ్డి వద్ద రాయచూర్ నుంచి మక్తల్ వైపు వస్తున్న బూడిద టిప్పర్ బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో సంజీవ్‌కు తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదవశాత్తు
రైలు కింద పడి మృతి
గద్వాల క్రైం: కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం గద్వాల రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. రైల్వే హేడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపిన కథనం మేరకు.. వనపర్తి జిల్లాకు చెందిన చాకలి కొండన్న గద్వాల నుంచి గుంతకల్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో రైలు కదులుతుండగా ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారీ రైలు కిందపడ్డాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే హేడ్ కానిస్టేబుల్ తెలిపారు.
రైలు కిందపడి వ్యక్తి దుర్మరణం
మానవపాడు: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని నారాయణపురం రైల్వేట్రాక్‌పై చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్‌కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురం శివారు ప్రాంతంలో రైలు కిందపడి గుర్తు తెలియిని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి శరీరంపై బనియన్, గోధుమ రంగు కలర్ షార్ట్ ఉంది. మృతుడికి సుమారు 50 ఏళ్ల ఉండవొచ్చన్నారు. కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ నుంచి కర్నూల్‌కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు మృతుడి వద్ద టికెట్ లభించిందని తెలిపారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచామని, సమాచారం తెలిసిన వారు గద్వాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ 83412 52529 సంప్రదించాలన్నారు.
మంత్రి స్వగ్రామంలో వార్డు మెంబర్ రాజీనామా


