ముందుకెళ్దామా? | - | Sakshi
Sakshi News home page

ముందుకెళ్దామా?

Jul 30 2026 4:42 AM | Updated on Jul 30 2026 4:42 AM

ముసురుకుంది..

సాక్షి, మహబూబాబాద్‌: వానాకాలం పంటలు సాగుచేసి నష్టపోవాలి. యాసంగి పంటలు సాగుచేయకుండా నష్టపోవాలని అంటారు పెద్దలు. అయితే ఈ ఏడాది జూలై చివరి వారం వరకు కూడా పెద్ద వాన పడలేదు. దీంతో ఆరుతడి పంటల సాగుకు సిద్ధమైన రైతులు.. గత మూడు రోజులు గా జిల్లా వ్యాప్తంగా ముసురుపట్టడంతో వరి, మిర్చి పంటలు సాగు చేద్దామా.. వద్దా అనే తర్జనభర్జనలో ఉన్నారు.

మూడు రోజులుగా..

ఈనెల మూడోవారం వరకు వర్షాలు కురువక జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. అయితే మూడు రోజుల నుంచి ముసురు పెడుతోంది. బుధవారం జిల్లాలో 145.9 మిల్లీ మీటర్లు, సగటున 8.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా పెద్దవంగరలో 28 మిల్లీ మీటర్లు, కొత్తగూడ 13మిల్లీ మీటర్లు, గంగారంలో 12.8 మిల్లీమీటర్లు నమోదు కాగా.. అత్యల్పంగా సీరోలు మండలంలో 0.8 మిల్లీ మీటర్లు, మరిపెడలో 3.5 మిల్లీ మీటర్లు, డోర్నకల్‌లో 4.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సోమవారం మొదలైన ముసురు బుధవారం వరకు మధ్య మధ్యలో ఆగుతూ కురిసింది.

రైతుల తర్జనభర్జన..

ప్రతీ సంవత్సరం మాదిరిగానే వరి సాగుకు సిద్ధమైన రైతులు సకాలంలో వర్షాలు కురువకపోవడంతో కాస్త వెనకడుగు వేశారు. అయితే మూడు రోజులుగా ముసురు పెట్టడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. కాగా, వానాకాలం సీజన్‌లో మొత్తం 4,56,136 ఎకరాల్లో అన్ని పంటలు సాగుచేస్తారని అంధికారులు ప్రణాళికలో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 1,93,850 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఇందులో పత్తి అంచనా 88,426 ఎకరాలు ఉండగా.. 89,647 ఎకరాల్లో సాగు చేశారు. అదేవిధంగా మొక్కజొన్న సాగు అంచనా 56,725 ఎకరాలు ఉండగా.. 42,300 ఎకరాల్లో సాగుచేశారు. మొక్కజొన్న సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా వరి సాగు అంచనా 2,18,557 ఎకరాలు ఉండగా.. ఆగుతూ సాగుతూ ఇప్పటి వరకు 50,262 ఎకరాలకు చేరింది. అయితే మరో 1,27,083 ఎకరాల సాగుకు వరి నారు సిద్ధంగా ఉంది. దీనికి తోడు నారు లేకుండా నేరుగా ధాన్యం వెదజల్లే పద్ధతిలో పలువురు రైతులు వరి సాగు చేస్తున్నారు. 25వేల ఎకరాలకు మించి మిర్చి పంట సాగు చేస్తారని అంచనా వేయగా 12,600 ఎకరాల సాగుకు నారు సిద్ధంగా ఉంది. మిగిలిన మిర్చినారు నర్సరీల్లో పెంచుతున్నారు. అయితే వరి, మిర్చి పంటల సాగుకు సమృద్ధిగా నీటి వనరులు ఉంటేకానీ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

పరిస్థితిని చూసి సాగుచేసుకోవాలి

మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు పడడం సంతోషం. జలాశయాల్లో నీటి లభ్యతపై నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షించాం. వరి, మిర్చి పంటకు ఈ వర్షాలు సరిపోవు. ప్రస్తుత పరిస్థితికి తోడు పెద్ద వర్షాలు పడితేనే జలాశయాల్లోకి నీరు వస్తుంది. నీటి లభ్యత, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా వరి సాగు చేసుకోవచ్చు.

– విజయచంద్ర, జిల్లా వ్యవసాయాధికారి

వరి, మిర్చి సాగుపై రైతుల తర్జనభర్జన

మూడురోజుల ముసురుతో

మారిన వాతావరణం

ఆరుతడి పంటలే మేలు అంటున్న వ్యవసాయ అధికారులు

వరి సాగుకే రైతుల మొగ్గు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement