గూడూరు: జలపాతం పైభాగానికి ఎవరూ వెళ్లొద్దని, జాగ్రత్తలు పాటిస్తూ స్నానమాచరించాలని సీఐ వినయ్‌కుమార్ సూచించారు. మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప దట్టమైన అడవిలోని భీమునిపాద జలపాతం వద్ద స్నానాలు చేస్తున్న పర్యాటకులకు పలు జాగ్రత్తలు తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుధవారం జలపాతం జాలువారుతుండగా.. పర్యాటకుల సందడి నెలకొంది. ఈమేరకు సమాచారం తెలుసుకున్న సీఐ జలపాతాన్ని సందర్శించి, పర్యాటకులకు పలు సూచనలు చేశారు.
9అడుగులకు చేరిన బయ్యారం పెద్దచెరువు
బయ్యారం: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు చిరుజల్లులతో కూడిన వర్షం కురవడంతో వరిపంట సాగు చేసే రైతులు పనుల్లో నిమగ్నమయ్యారు. మహబూబాబాద్–భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో కురిసిన వర్షంతో మండలంలో ప్రవహించే పందిపంపుల, మసివాగు, రాళ్లవాగు నుంచి మోస్తరుగా వరదప్రవాహం బయ్యారం పెద్దచెరువులోకి చేరుతోంది. దీంతో 16.2 అడుగుల నీటిసామర్థ్యం ఉన్న చెరువులోకి సాయత్రం వరకు 9అడుగుల మేర నీరు చేరింది.
ప్రజలు జాగ్రత్తలు
పాటించాలి
నెహ్రూసెంటర్: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పి.విజేందర్‌రెడ్డి బుధవారం సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, విద్యుత్ పట్ల నిర్లక్ష్యం చేయకుండా అవగాహన పెంచుకోవాలని సూచించారు. రైతులు వ్యవసాయ క్షేత్రాల వద్ద సేఫ్టీ నిబంధనలు పాటించాలని, తక్కువ ఎత్తులో ఉన్న, లూస్‌లైన్లు, విరిగిన పోల్స్ ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల వద్దకు వెళ్లొద్దన్నారు. కొత్త భవనాల నిర్మాణంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.2 మీటర్ల భద్రత దూరం పాటించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.
‘సర్’పై సమీక్ష
బయ్యారం: మండలంలో బూత్‌ల వారీగా సర్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ సర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి మండలంలోని కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు బూత్‌ల వారీగా సర్ కార్యక్రమంపై బీఎల్‌ఏలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సీతారాంరెడ్డి, కొత్తపేట సర్పంచ్ ప్రవీణ్‌నాయక్, మాజీ ఎంపీటీసీ గోపాల్, నాయకులు రాంబాబు, శివ, ప్రశాంత్, రాంమూర్తి, సురేష్, మహేష్, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నిరంజన్, నాగరాజు, వినయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రవేశ పరీక్షకు హాజరుకావాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల ఉచిత శిక్షణకు ఆగస్టు 2న ప్రవేశ(స్క్రీనింగ్) పరీక్ష నిర్వహిస్తామని జిల్లా పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్, మహర్షి స్కూల్‌లో ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని, ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని సూచించారు. రవాణా సౌకర్యం అవసరమైన అభ్యర్థులు తమ సమీప పోలీస్ స్టేషన్‌లో సంప్రదించవచ్చని, అవసరాన్ని బట్టి సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రాలకు వాహనాలు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


