మరిపెడ రూరల్: మరిపెడ మండల కేంద్రంలో స్థాయికి మించి వైద్యం చేస్తూ ఓ బాలుడి మృతికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజత్ క్లినిక్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఇటీవల మూడేళ్ల బాలుడికి ఆర్‌ఎంపీ ఇంజక్షన్ ఇవ్వగా.. కాసేపటికే అతడు మృతి చెందిన ఘటనపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందించిన డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ వైద్యబృందం క్లినిక్‌ను తనిఖీ చేసింది. అనంతరం నిబంధనల ఉల్లంఘనను గుర్తించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ మాట్లాడుతూ.. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, ఇంజక్షన్లు వేయడం, సైలెన్ పెట్టడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. జిల్లాలోని ఆర్‌ఎంపీలందరూ ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ తనిఖీల్లో వైద్య బృందం సభ్యులు మనోహర్, కృష్ణ ఉన్నారు.


