నెహ్రూసెంటర్: జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీ లు, బస్తీ దవాఖానాల్లో రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని టీహబ్‌కు పంపిస్తుంటారు. అక్కడ రక్త నమూనాలను పరీక్షించి రిపోర్టులను రోగి మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపిస్తారు. దీని కోసం 24 సెంటర్ల నుంచి 5 రూట్లలో ప్రత్యేక వాహనాల(కార్లు)ను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఈ వాహనాలకు అగ్రిమెంట్ ద్వారా ప్రతీ నెల అద్దె చెల్లిస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు అద్దె వాహనాదారులు అగ్రిమెంట్ చేసుకున్న వాహనాలను ఉపయోగించకుండా శాంపిల్స్ సేకరణకు ద్విచక్ర వాహనాలు, ఆటోలను వినియోగించడం గమనార్హం. అగ్రిమెంట్ చేసుకున్న వాహనాలను నడపకుండా బిల్లులు స్వాహా చేస్తున్నారు. ఇదంతా తెలిసినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
ఒక్కో వాహనానికి కేటాయించిన
రూట్లు ఇలా..
రూట్ 1: తొర్రూరు, నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం, సిగ్నల్ కాలనీ
రూట్ 2: గంగారం, కొత్తగూడ, కోమట్లగూడెం
రూట్3: సీహెచ్‌సీ గూడూరు, అయోధ్యపురం, తీగలవేణి, కంబాలపల్లి, యూపీహెచ్‌సీ మహబూబాబాద్, మల్యాల
రూట్ 4: బలపాల, బయ్యారం, గంధంపల్లి, గార్ల, డోర్నకల్, ముల్కనూర్
రూట్ 5: దంతాలపల్లి, కురవి, మరిపెడ, ఉగ్గంపల్లి
బిల్లుల చెల్లింపు..
వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అగ్రిమెంట్ చేసుకున్న ప్రతీ వాహనానికి ప్రతీ నెల రూ.33వేలు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే అగ్రిమెంట్ ప్రకారం వాహనాలను నడపకుండానే వాహనదారులు బిల్లులు పొందుతున్నారు. ఒక్కో వాహనానికి కేటాయించిన రూట్లలో ప్రతీ రోజు రక్త నమూనాలను తీసుకురావాల్సి ఉంది. అయితే మొక్కుబడిన శాంపిల్స్‌ను తీసుకువచ్చి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో కోల్డ్ బాక్సుల్లో టెంపరేచర్ మొయింటెన్ చేస్తూ మాత్రమే రక్తనమూనాలు ల్యాబ్‌కు తీసుకురావాల్సి ఉండగా.. అలాంటి నిబంధనలు పట్టనట్లు వ్యవహరించడం రోగుల పాలిట శాపంగా మారుతోంది.
తనిఖీలు చేపట్టని అధికారులు..
అగ్రిమెంట్ చేసుకున్న వాహనాలకు బదులు ద్విచక్ర వాహనాలపై శాంపిల్స్ తీసుకొచ్చి బిల్లులు స్వాహా చేస్తున్నప్పటికీ.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టడం లేదు. బిల్లుల చెల్లింపు, అగ్రిమెంట్ సమయంలోనే వాహనాలను (కారు) పరిశీలిస్తున్న అధికారులు శాంపిల్స్ సేకరణ, రిపోర్టులు, వైద్యం ఎలా అందుతుందో మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు చర్యలు చేపట్టి ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని ప్రజలు కోరుతున్నారు.
వాహనాల అగ్రిమెంట్ రద్దు చేస్తాం
రక్తనమూనాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన వాహనాలను వినియోగించకుంటే చర్యలు తీసుకుని వాటిని తొలగిస్తాం. ప్రత్యేక వాహనాలను కాకుండా టూవీలర్స్, ఆటోల్లో శాంపిల్స్ తీసుకురావొద్దు. అగ్రిమెంట్ చేసుకున్న వాహనాలకు రక్తనమూనాల సేకరణకు బిల్లులు చెల్లిస్తున్నాం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– రవిరాథోడ్, డీఎంహెచ్‌ఓ
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో రోగులనుంచి శాంపిళ్ల సేకరణ
జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు
అద్దె వాహనాల ఏర్పాటు
వాహనాలు నడపకుండానే బిల్లులు
తనిఖీలు మరిచిన వైద్యారోగ్యశాఖ అధికారులు
కలగానే రోగులకు మెరుగైన వైద్యం


